
రాజమహేంద్రవరంలో పది కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజే లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ‘టెన్ కోర్ట్స్’ (పది కోర్టుల) భవన సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రారంభించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నూతన భవనం ఒక నిదర్శనమని ఇది న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు కోర్టు హాళ్లను, రికార్డు గదులను మరియు న్యాయవాదుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను పరిశీలించారు. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం భవనంలోని సాంకేతిక హంగులను డిజిటల్ కోర్టు సదుపాయాలను అతిథులకు వివరించారు.
సముదాయంలోని పది కోర్టులు అందుబాటులోకి రావడంతో కేసుల విచారణలో జాప్యం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కేంద్రీకృత కోర్టు భవనం ఎంతో దోహదపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
