Let's talk: editor@tmv.in
దేశాభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్‌ది కీలకపాత్ర: రాష్ట్రపతి

దేశాభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్‌ది కీలకపాత్ర: రాష్ట్రపతి

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఉపరాష్ట్రపతి సీపీ.రాధకృష్ణన్, ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన, దేశ నిర్మాణం కోసం మరింత కట్టుబాటు పెంచుకోవాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. దేశం కొత్త ఆశయాలతో ముందుకు సాగుతున్న ఈ సమయంలో, సివిల్ సర్వెంట్స్ నిష్ఠ, అనురాగం రాష్ట్రం–ప్రజల మధ్య విశ్వాసాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. దేశ సమగ్రాభివృద్ధి, సమాన అవకాశాల కల్పనలో వారి పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భారత పరిపాలనా వ్యవస్థకు సివిల్ సర్వెంట్స్ స్థంభంలాంటివారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రజలకు సేవలందించడం, పాలనను బలోపేతం చేయడంలో వారి కృషి విశేషమని ప్రశంసించారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి విధానాల రూపకల్పన వరకు సివిల్ సర్వెంట్స్ చేస్తున్న పని కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోందని అన్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు కీలకమని పేర్కొన్నారు. ఈ ఏడాది థీమ్‌ ‘వికసిత భారత్: పౌర కేంద్రిత పాలన – చివరి వ్యక్తికి వరకు చేరే అభివృద్ధి’గా ఉందని తెలిపారు. పారదర్శక, బాధ్యతాయుత, పౌర కేంద్రిత పాలనకు ఇది ప్రతిబింబమని చెప్పారు. దేశానికి సేవ చేయడం ‘వికసిత భారత్‌’ నిర్మాణానికి పునాది అని ప్రధాని పేర్కొన్నారు. చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 21న సివిల్ సర్వీసెస్ డేను జరుపుకుంటారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు తమ బాధ్యతలను మరోసారి గుర్తుచేసుకుని, సేవా నిబద్ధతను పునరుద్ధరించుకునే సందర్భంగా ఈ దినాన్ని గుర్తిస్తారు. ఈ రోజును 1947లో స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి హోంమంత్రి సర్దార్‌‌ వల్లభాయ్‌ పటేల్‌ పరిపాలనా సేవల శిక్షణార్థులకు ఇచ్చిన ప్రసంగాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారు. ఆయన సివిల్ సర్వెంట్స్‌ను ‘భారతదేశపు స్టీల్ ఫ్రేమ్’గా అభివర్ణించారు.