
సర్‌కు రాజకీయ రంగు లేదు: ఎన్. రామచందర్‌రావు
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోయే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదా రాజకీయ రంగు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మంగళవారం స్పష్టం చేశారు. ఇది భారత ఎన్నికల సంఘం క్రమబద్ధంగా నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను, వ్యత్యాసాలను సరిదిద్ది జాబితాను ప్రక్షాళన చేయడమే ఈ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో నిర్వహించినట్లుగానే తెలంగాణలో కూడా నకిలీ ఓటర్లు, అక్రమ వలసదారులు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించి తొలగించే చర్యలు చేపడతామని చెప్పారు. ఓటరు జాబితాలో నిజమైన ఓటర్ల పేర్లే ఉండాలి. నకిలీ ఓటర్లు, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారి పేర్లు ఉంటే వాటిని తొలగించాల్సిందే. ఈ ప్రక్రియకు రాజకీయ ఉద్దేశాలు లేవు. ఎన్నికల సంఘం తరచూ నిర్వహించే సాధారణ చర్య ఇది అని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి పెద్ద ఎన్నికలు షెడ్యూల్ లేనందున, ఈ ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, అలాగే దీని గడువును మరికొంత కాలం పొడిగించాలని వారు కోరారు.
తెలంగాణలో సర్ షెడ్యూల్ ఇలా..
భారత ఎన్నికల సంఘం మే 14న దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ మూడో దశ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో తెలంగాణ కూడా భాగమైంది. సుమారు 36 కోట్ల మంది ఓటర్ల వివరాలను దశలవారీగా సరిచేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. జనగణనలో భాగంగా జరుగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణ, పంజాబ్‌లకు అక్టోబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించారు. జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక కార్యక్రమాలు, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓల ఇంటింటి పర్యటనలు నిర్వహించనున్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రకటించనున్నారు.
