Let's talk: editor@tmv.in
“NBK 112”తో అమరావతిలో సినీ సందడి..
“NBK 112”తో అమరావతిలో సినీ సందడి..
“NBK 112”తో అమరావతిలో సినీ సందడి..
“NBK 112”తో అమరావతిలో సినీ సందడి..

“NBK 112”తో అమరావతిలో సినీ సందడి..

Dantu Vijaya Lakshmi Prasanna
26 జూన్, 2026

ప్రజా రాజధాని అమరావతిలో ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ ఘనంగా ప్రారంభమైంది. వెంకటాయపాలెంలో నిర్వహించిన ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల అనంతరం మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ చిత్ర స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. అనంతరం ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ‘యాక్షన్’ అంటూ చిత్రీకరణను ప్రారంభించారు. హీరో నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు చెరుకూరి సుధాకర్, మిక్కిలినేని సుధాకర్ తదితరులను మంత్రులు అభినందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా స్టూడియోలు, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణం కోసం కార్యాచరణ చేపడుతున్నామని వెల్లడించారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఇటీవలే భరత్ భూషణ్ ఛైర్మన్‌గా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రజా రాజధాని అమరావతి వేదికగా ఒక భారీ చిత్రం ప్రారంభం కావడం, దాని షూటింగ్‌లో అధిక భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించడం శుభపరిణామమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడేందుకు ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన కథాంశం, సాంకేతిక నైపుణ్యం, బలమైన నటీనటులతో రూపొందుతోందని మంత్రి చెప్పారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే, ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్రంగా పేరొందిన విజయవాడలో మళ్లీ సినీ కార్యకలాపాలను ప్రోత్సహించి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నవ్యాంధ్రలో సినిమా పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు సినిమాటోగ్రఫీ మంత్రిగా తనవంతు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

‘NBK 112’ చిత్ర ప్రారంభోత్సవం ద్వారా అమరావతి మరోసారి సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించగా, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది నాంది పలికిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ట్యాగ్‌లు
NBK112NandamuriBalakrishnaBalakrishnaMovieNBK112LaunchAmaravatiAndhraPradeshAPFilmIndustryTeluguCinemaTollywoodKoratalaSivaNaraLokeshKandulaDurgeshAndhraPradeshNewsFilmIndustryDevelopmentAPGovernmentMovieLaunchTeluguFilmIndustryAmaravatiNewsBalayyaBabuTollywoodNewsCinemaNewsAPUpdatesStudioDevelopmentFilmCityAPBreakingNewsLatestNewsEntertainmentNewsMovieShootingAndhraPradeshDevelopmentNBKFans