Let's talk: editor@tmv.in
‘చోటే భాయ్-బడే భాయ్’ కలిసి పేదల ఇళ్లు కూలుస్తున్నారు: కేటీఆర్

‘చోటే భాయ్-బడే భాయ్’ కలిసి పేదల ఇళ్లు కూలుస్తున్నారు: కేటీఆర్

Gaddamidi Naveen
22 జూన్, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న పేదల వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం, అలాగే హనుమాన్ నగర్‌లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స‌ర్) పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

గాంధీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసాన్ని చూస్తే మహాత్ముని ఆత్మ కూడా ఘోషిస్తుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ నమ్మేది గాడ్సేను అయినా, గాంధీ విగ్రహం పెడతానని దొంగ మాటలు చెబుతున్నారని విమర్శించారు.ప్ర‌ధాని మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ 'బడే భాయ్ - చోటే భాయ్' లా మారి మూసీ భూములను కొల్లగొట్టేందుకు నిరుపేదల ఇళ్లను కూలుస్తున్నారని, దీనికి బీజేపీ కూడా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా హామీలకు డబ్బుల్లేవని చెబుతూ, మూసీ ప్రాజెక్టు పేరిట మాత్రం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవడం వెనుక లూటీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు.

హనుమాన్ నగర్ బస్తీ వాసులకు భరోసా

60 ఏళ్లుగా హనుమాన్ నగర్ బస్తీలో ఉంటున్న ప్రజల ఇళ్లను లాక్కోవాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని చూస్తున్నారని స్థానికులు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. హనుమాన్ నగర్ మూసీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కావాలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుంపు మేస్త్రి” రేవంత్ రెడ్డి నగరంలో ఒక్క ఇటుక పేర్చలేదు కానీ, ఇళ్లు కూల్చడంలో బిజీగా ఉన్నారని, హైడ్రా పెద్దలకో నీతి.. పేదలకో నీతి అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ రెండున్నర ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, పైగా ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది నేతలు పోయినా గులాబీ సైన్యం బలంగా ఉందన్నారు. ఇంకొక్క ఏడాది ఓపిక పట్టండి, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. మీ ఇళ్లను కాపాడి, పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని బస్తీ వాసులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్వామి గౌడ్, కార్తీక్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
KTRKTRBRSBRSBRSPartyKCRTelanganaPoliticsRajendranagarHanumanNagarBastiBataMusiRiverMusiProjectHydraHyderabad
‘చోటే భాయ్-బడే భాయ్’ కలిసి పేదల ఇళ్లు కూలుస్తున్నారు: కేటీఆర్ - Tholi Paluku