Let's talk: editor@tmv.in
చిత్తూరు–తచ్చూరు ఆరు లేన్ల హైవే ట్రయల్ రన్ ప్రారంభం

చిత్తూరు–తచ్చూరు ఆరు లేన్ల హైవే ట్రయల్ రన్ ప్రారంభం

Panthagani Anusha
25 ఏప్రిల్, 2026

చిత్తూరు జిల్లా వాసుల దశాబ్దాల కల, పారిశ్రామిక కారిడార్ల అనుసంధానకర్త అయిన చిత్తూరు–తచ్చూరు ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్‌-716బి) ఎట్టకేలకు పట్టాలెక్కింది. సుమారు 116 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ అత్యాధునిక రహదారిలో వాహనాల రాకపోకలను ట్రయల్ రన్ ప్రాతిపదికన అధికారులు ప్రారంభించారు. రూ.5,486.32 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ రహదారి బెంగళూరు–చెన్నై ఆర్థిక కారిడార్‌కు ప్రధాన అనుసంధానకర్తగా నిలవనుంది.

జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ప్రాజెక్టును అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసింది. రహదారి పొడవునా ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 24 ప్రధాన వంతెనలు, 17 చిన్న వంతెనలను నిర్మించారు. రైల్వే లైన్లను దాటేందుకు 4 భారీ ఆర్వోబీ లను సిద్ధం చేశారు. స్థానిక ప్రజలు, రైతులు రహదారిని దాటేందుకు వీలుగా 16 పెద్ద వాహన అండర్‌పాస్‌లు 39 చిన్న వాహన అండర్‌పాస్‌లు అదేవిదంగా 195 బాక్స్ కల్వర్టులను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరాయ ప్రయాణానికి మార్గం సుగమం చేశారు.

స్మార్ట్ నిఘా.. ప్రయాణికులకు భద్రత

ఈ హైవేను కేవలం రహదారిగా మాత్రమే కాకుండా, ఒక స్మార్ట్ కారిడార్ గా తీర్చిదిద్దారు. అత్యాధునిక 'ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' ద్వారా ప్రతి వాహనం కదలికను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం 115 పి.టి.జెడ్ కెమెరాలు, 120 నిఘా కెమెరాలను అమర్చారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు సహాయం కోరేందుకు 86 ఎమర్జెన్సీ టెలిఫోన్లను అందుబాటులో ఉంచారు. ప్రమాదాలను ముందే పసిగట్టే వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్స్, వేగ నియంత్రణ సూచీలు ఈ మార్గంలో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేయనున్నాయి.

పచ్చదనానికి పెద్దపీట

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైవే వెంబడి 80 వేలకు పైగా మొక్కలను నాటారు. గ్రీన్ హైవే కాన్సెప్ట్‌లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ ఇనుప కంచెలకు బదులుగా పర్యావరణ హితమైన ‘బాంబూ క్రాష్ బారియర్ల’ను ఏర్పాటు చేయడం విశేషం. ఇది భద్రతతో పాటు రహదారికి సహజసిద్ధమైన అందాన్ని ఇస్తోంది.

ప్రాంతీయ అభివృద్ధికి కొత్త రూపు

చిత్తూరు నుంచి ఉత్తుకోట్టై వరకు సాగే ఈ రహదారి మార్గమధ్యలో అనుపల్లె, అర్థం, పల్లిపట్టు, నగరి, ఎస్.ఆర్.పురం వంటి ప్రధాన ప్రాంతాలకు యాక్సెస్ పాయింట్లు ఇచ్చారు. దీనివల్ల ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు పుంజుకోనున్నాయి. ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ఇంధన పొదుపు కూడా జరుగుతుందని త్వరలోనే ఈ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.