
సీఈఐఆర్ సాంకేతికతో చిత్తూరు పోలీసుల ఘనత.. కోట్ల విలువైన మొబైల్‌ల రికవరీ
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో చిత్తూరు జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ముందంజలో నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్' (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. తాజాగా జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల ద్వారా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 501 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూండీ బాధితులకు నేరుగా ఈ ఫోన్లను అప్పగించారు.
గణనీయంగా పెరుగుతున్న రికవరీలు
గత కొంతకాలంగా జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సాంకేతికత సహాయంతో మొత్తం 4,607 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.9 కోట్ల 55 లక్షలుగా ఉంటుందని అంచనా. కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో సైతం గాలింపు చేపట్టి ఫోన్లను రికవరీ చేయడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది.
స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు.. ఎఫ్‌ఐఆర్ అవసరం లేదు
సాధారణ ప్రజలకు పోలీసు సేవలని మరింత చేరువ చేసేందుకు ఈ విధానం దోహదపడుతోంది. బాధితులు తమ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు టెక్నికల్ నిఘా ఏర్పాటు చేసి ఫోన్లను గుర్తిస్తున్నారు.
దూర ప్రాంత బాధితులకు కొరియర్ సాయం
దూర ప్రాంతాల నుంచి రికవరీ చేసిన ఫోన్లను సేకరించడానికి రాలేని బాధితుల కోసం పోలీసులు మానవీయ కోణంలో ఆలోచిస్తున్నారు. అటువంటి వారికి రిజిస్టర్డ్ కొరియర్ ద్వారా ఫోన్లను ఇంటికే పంపిస్తున్నారు. తమ ఆశలు వదులుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి తమ చేతికి చేరడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు సాధ్యమైనంత త్వరగా పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని, దీనివల్ల ఫోన్ దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చని సూచించారు.
