Let's talk: editor@tmv.in
చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి: మంత్రి సీతక్క
చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి: మంత్రి సీతక్క

చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి: మంత్రి సీతక్క

Gaddamidi Naveen
20 జూన్, 2026

చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ఆనందకర బాల్యమే నిజమైన అభివృద్ధికి పునాది అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని అరుంధతి నగర్‌లో ఏర్పాటు చేసిన అంగన్‌‌వాడీ కేంద్రం-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన మంత్రి, వారి అభ్యాస ప్రదర్శనలను వీక్షించి అభినందించారు. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్‌తో కలిసి చిన్నారులతో కేక్ కట్ చేశారు.

హైదరాబాద్ నగరంలో తొలి పాలన కేంద్రాన్ని చాంద్రాయణగుట్టలో ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆటల ద్వారా అభ్యాసాన్ని అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ నర్సరీల్లో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నాణ్యమైన సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకొచ్చిందన్నారు.

అంగన్‌‌వాడీ, పాలన కేంద్రాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం వల్ల ఒకే కుటుంబంలోని చిన్నారులందరికీ సమగ్ర సేవలు అందుతాయని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం బయటకు వెళ్లే తల్లులకు ఈ డే కేర్ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పిల్లల సంరక్షణ కోసం మహిళలు ఉపాధిని వదులుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాలన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. చిన్నారి జీవితంలోని తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, ఆ దశలో శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

అంగన్‌‌వాడీ కేంద్రాలను ప్రైవేట్ నర్సరీలకు దీటుగా తీర్చిదిద్దుతూ 57 రకాల ఆటవస్తువులు, యూనిఫాంలు, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ప్రతి చిన్నారికి సురక్షిత బాల్యం, ప్రతి తల్లికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.