

ప్రభుత్వ బడుల్లోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా కార్పొరేట్ స్థాయి ఫలితాలను సాధిస్తున్నాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని 7వ వార్డులో నిర్వహించిన "బడి పిలుస్తోంది" కార్యక్రమంలో ఆయన డీఈఓ ప్రసాద్ బాబు, సర్వశిక్షా అభియాన్ పీడీ శైలజతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్' ద్వారా నాణ్యమైన పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందిస్తున్నామని తెలిపారు. 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం' పథకం కింద సన్నబియ్యంతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది పిల్లలు చదివినా అందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తిస్తుందని, ఇది పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని అన్నారు.
విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
విద్యార్థుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఒక కీలక ప్రకటన చేశారు. ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు, పాఠశాలలకు వెళ్లేందుకు వీలుగా రాబోయే మూడు నెలల్లో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 20 మంది చిన్నారులు కొత్తగా పాఠశాలలో చేరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
