
రద్దీకి చెక్..విశాఖ స్టేషన్‌లో రాపిడో పికప్ కేంద్రం ప్రారంభం
రైలు దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో ఎదురవుతున్న రవాణా ఇబ్బందులను తొలగించేందుకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం 'రాపిడో' ప్రత్యేక పికప్ కేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ప్రయాణికులకు 'చివరి మైలు కనెక్టివిటీని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
క్రమబద్ధమైన రవాణా సదుపాయం
ఈ ప్రత్యేక పికప్ జోన్‌ను డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా రిబ్బన్ కత్తిరించి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా రైడ్ బుకింగ్ యాప్‌లలో అంచనా సమయం తక్కువగా చూపించినప్పటికీ డ్రైవర్లు స్టేషన్ లోపలికి రావడంలో ఆలస్యం జరగడం వల్ల ప్రయాణికులు బయట వేచి ఉండాల్సి వస్తోందన్నారు. దీనివల్ల స్టేషన్ ఆవరణలో రద్దీ పెరిగి గందరగోళం ఏర్పడుతోందని, దీనిని నివారించేందుకు 'నాన్-ఫేర్ రెవెన్యూ' విధానంలో ఈ ప్రత్యేక జోన్‌ను అభివృద్ధి చేసినట్లు వివరించారు.
సమన్వయం సులభం.. సమయం ఆదా
ఈ కేంద్రం ఏర్పాటుతో ప్రయాణికులు రాపిడో డ్రైవర్ల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు బుక్ చేసుకున్న వాహనం నిర్దేశిత పికప్ పాయింట్ వద్దే అందుబాటులో ఉండటం వల్ల వేచి చూసే సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ సుమారు 8 వేల నుంచి 10 వేల మంది ప్రయాణికులు ఈ సౌకర్యం ద్వారా లబ్ధి పొందుతారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.
మహిళల భద్రతకు పెద్దపీట
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్‌ఎం తెలిపారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లను ఎంచుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు సహాయం అవసరమైన వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టేషన్ నుంచి బయటకు రాగానే తక్కువ సమయంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
