Let's talk: editor@tmv.in
ఛేజింగ్‌..పంజాబే కింగ్‌
ఛేజింగ్‌..పంజాబే కింగ్‌

ఛేజింగ్‌..పంజాబే కింగ్‌

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ సంచలనం సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు ఛేజింగ్‌ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఆటగాళ్లు ఊదేశారు. వారి ముందు పెద్దలక్ష్యం చిన్నబోయింది. బౌలర్లను ఊచకోత కోస్తూ దంచి కొట్టారు. స్టేడియం నలుదిశలా బౌండరీలు బాదుతూ విశ్వరూపం చూపెట్టారు. పంజాబ్‌ ఆటగాళ్లలో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ బాల్‌ పడేది ఆలస్యం అది బౌండరీ వైపే అన్నట్లు నిర్దాక్షిణ్యంగా వేటాడాడు. 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 పరుగులు రాబట్టాడు. ఉన్నంతసేపు వీరబాదుడు బాదాడు. ప్రియాంశ్‌ అర్యా, కప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌‌ సిక్స్‌లు, బౌండరీలతో స్కోర్‌‌బోర్డును పరుగులు పెట్టించారు. మొదటి వికెట్‌కు 7 ఓవర్లలోనే 126 పరుగులు సాధించారు. శనివారం అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది.

కేఎల్‌ రాహుల్‌ మాస్‌ బ్యాటింగ్‌

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ తన క్లాస్, మాస్‌ ఆటతో 67 బంతుల్లో 152 పరుగులు చేసి ఐపీఎల్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అతనికి తోడుగా నితీష్ రాణా 91 పరుగులతో మెరిసి, రెండో వికెట్‌కు 220 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76), ప్రియాంశ్ ఆర్య (73) కేవలం 42 బంతుల్లోనే 126 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి మ్యాచ్‌కు బలమైన పునాది వేశారు. తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సాధించింది.

పంజాబ్‌ ఆజేయంగా.. ఆగ్రస్థానంలో

ఈ మ్యాచ్‌లో మొత్తం 49 బౌండరీలు, 33 సిక్సర్లు నమోదవ్వగా, బౌలర్లకు ఇది కఠినమైన పోరాటంగా మారింది. ఇరు జట్లు ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేయడం కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. మ్యాచ్ మధ్యలో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో గాయపడి మైదానం వీడాల్సి రావడం ఆందోళన కలిగించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అజేయంగా కొనసాగుతూ 6 మ్యాచ్‌లలో 11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే జట్టు 2024లో కొల్‌కత్తా నైట్ రైడర్స్ పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అప్పటి రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇక ఢిల్లీ బ్యాటింగ్‌లో రాహుల్, రాణా జోడి ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలోనే జట్టును బలమైన స్థితిలో నిలిపింది. మధ్య ఓవర్లలో వేగాన్ని పెంచి భారీ స్కోరు సాధించారు. అయినప్పటికీ పంజాబ్ దూకుడైన బ్యాటింగ్ ముందు ఆ స్కోరు సరిపోలలేదు. భారీ లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించగా, ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరిత బ్యాటింగ్ పోరాటంగా నిలిచింది.

ఛేజింగ్‌..పంజాబే కింగ్‌ - Tholi Paluku