

ఖైదీలలో మార్పు తీసుకురావాలి: డీజీపీ బి. శివధర్ రెడ్డి
తెలంగాణలో జైలు పరిపాలన రంగంలో అంతర్రాష్ట్ర సహకారానికి మరో మైలురాయిగా నిలిచే విధంగా, చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐసీఏ)లో ఢిల్లీ జైలు సిబ్బందికి ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఎస్ఐసీఏ ఫ్యాకల్టీ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
ఈ శిక్షణ కార్యక్రమం జైలు పరిపాలనలో రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. 2026 సంవత్సరంలో మొత్తం 381 మంది ఢిల్లీ జైలు సిబ్బందిని దశలవారీగా శిక్షణకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ప్రారంభమైన తొలి విడతలో 62 మంది శిక్షణార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 61 మంది ఢిల్లీ జైళ్ల విభాగానికి చెందినవారు కాగా, ఒకరు తెలంగాణ జైళ్ల విభాగానికి చెందిన వార్డర్. ఈ బృందంలో 18 మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లు (15 మంది పురుషులు, 3 మంది మహిళలు), 43 మంది మేట్రన్లు/మహిళా వార్డర్లు ఉన్నారు. అదనంగా అండమాన్ నికోబార్ ద్వీపాల నుంచి ఒక వార్డర్ కూడా ఈ కోర్సులో చేరనున్నారు.
సమగ్ర శిక్షణ ప్రణాళిక
తొమ్మిది నెలలపాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం, శిక్షణార్థుల్లో వృత్తిపర నైపుణ్యాలు, క్రమశిక్షణ, మానవీయ దృక్పథాన్ని పెంపొందించేలా రూపొందించబడింది. ఇండోర్ శిక్షణలో జైలు నియమాలు, క్రిమినాలజీ, బాధితుల అధ్యయనం, శిక్షాశాస్త్రం, మానసికశాస్త్రం, సామాజికశాస్త్రం, నేర చట్టాలు, రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, సాంకేతిక వినియోగం వంటి అంశాలు ఉంటాయి. అవుట్‌డోర్ శిక్షణలో శారీరక వ్యాయామాలు, పరేడ్, యోగా, ధ్యానం వంటి అంశాలు ఉంటాయి. ఎస్ఐసీఏ సంస్థలో ఆధునిక సదుపాయాలు శిక్షణార్థులకు అందుబాటులో ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, ఎయిర్ కండీషన్డ్ ఆడిటోరియం, గ్రంథాలయం, సుమారు 400 మందికి వసతి కలిగిన హాస్టల్, ప్రత్యేక శిక్షణ మైదానాలు, జిమ్, భోజన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత.
డీజీపీ ప్రసంగం - సంస్కరణల దిశగా
ఈ సందర్భంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. జైలు శాఖ బాధ్యతలు అత్యంత కీలకమైనవని తెలిపారు. కేవలం ఖైదీలను బంధించడం మాత్రమే కాదని, వారిలో మార్పు తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిసేలా చూడటమే ప్రధాన లక్ష్యమన్నారు. ఖైదీల పట్ల హుందాగా వ్యవహరిస్తూ, సంస్కరణల వైపు వారిని మళ్లించాలని ట్రైనీలకు సూచించారు. కాగా, ఇదే వేదికపై అధికారులు, సిబ్బంది డీజీపీ 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. గతంలో తిహార్ జైలు సిబ్బందికి కూడా ఎస్ఐసీఏ విజయవంతంగా శిక్షణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నిష్ణాతులైన ఫ్యాకల్టీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఇక్కడికి పంపిందని ఆమె పేర్కొన్నారు. జైళ్ల పరిపాలనలో శిక్షణకు తెలంగాణ ఇప్పుడు జాతీయ కేంద్రంగా మారుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
