
డీలిమిటేషన్‌కు చంద్రబాబు మద్దతు.. ఏపీకి నష్టం: మాణిక్కం ఠాగూర్
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో తన మామగారు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ.రామారావుకు కూడా ద్రోహం చేశారని, ఇప్పుడు అదే విధంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే చర్యలకు సహకరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు అధికారమే ముఖ్యమని ఆయన మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉన్నారు. తన సొంత కుటుంబానికే ద్రోహం చేసిన వ్యక్తి ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి దక్షిణ రాష్ట్రాల స్వరాన్ని బలహీనపరిచే వివక్షపూరిత డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తున్నారని ఠాగూర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కులగణన జరపకుండా డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల వెనుకబడిన వర్గాల మహిళలకు పార్లమెంట్‌లో అవకాశం తగ్గిపోతుందని ఆయన అన్నారు. ఇది నాయకత్వం కాదని ‘కల్క్యులేటెడ్ సరెండర్’ అని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వివరాలను మాణిక్కం ఠాగూర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు మా మద్దతు
అందులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానం, మహిళా రిజర్వేషన్ అమలుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచే ప్రతిపాదన సరైనదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్థానాల సంఖ్యను పెంచారు. ఇది శాస్త్రీయంగా రూపొందించిన సరైన ఫార్ములా. ఈ దశలో తీసుకున్న నిర్ణయంపై నాకు 100 శాతం సంతృప్తి ఉందని ఆయన తెలిపారు.
డీలిమిటేషన్‌ను తాజా జనగణన ఆధారంగా మాత్రమే చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గతంలో 1991 జనగణన ఆధారంగా స్థానాలను సవరించి తర్వాత వాటిని స్థిరపరిచారని గుర్తుచేశారు. రిజర్వేషన్ వల్ల కాలక్రమేణా నాయకత్వ నాణ్యత మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆర్థిక సాధికారత కోసం సామాజిక-ఆర్థిక కుల గణన అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలించాలని కోరుతానని చెప్పారు.
