
అమరావతి భూములను చంద్రబాబు తనవారికే పంచిపెడుతున్నారు: బీసీవైపీ
అమరావతి అభివృద్ధి పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టారని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ యాదవ్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హమీలను గుప్పించారు. తీరా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఎటువంటి హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
నాలుగో రోజుకు చేరిన నిరాహార దీక్ష
ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించిన తన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని, వారి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
అమరావతిలో సామాజిక న్యాయం కావాలి
అమరావతి అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని వాటిని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ సొత్తు కాదని స్పష్టం చేశారు.
వెనుకబడిన వర్గాలకు 1000 ఎకరాల డిమాండ్
అమరావతి రాజధాని ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు కనీసం 1000 ఎకరాల భూమి కేటాయించాలని బీసీవైపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. దీంతో పాటు మరో నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు. అమరావతి అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలని తాము కోరుతున్నామని యాదవ్ పేర్కొన్నారు.
