
ఏపీలో నిఫ్ట్, పీఎం మిత్రా పార్క్ ఏర్పాటుకు కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ జౌళి (టెక్స్‌టైల్) కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మేరకు సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు చిత్తూరు జిల్లా కుప్పంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్‌ను నెలకొల్పాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో నిఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఇప్పటికే 10 ఎకరాల భూమిని కేటాయించినట్లు కేంద్ర మంత్రికి తెలిపిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ. 280 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. కుప్పం ప్రాంతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జౌళి క్లస్టర్లకు సమీపంలో ఉండటంతో పాటు అక్కడ 35 వేల పవర్‌లూమ్స్, వందకు పైగా స్పిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్నందున పీఎం మిత్రా పార్క్‌కు అది అత్యంత అనువైన ప్రాంతమని వివరించారు. వీటితో పాటు మంగళగిరిలో హ్యాండ్‌లూమ్ పార్క్, అమరావతిలో హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో సాంప్రదాయ జౌళి రంగంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరులు కల్పించేలా సహజ పీచు (నేచురల్ ఫైబర్) ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రంలో సుమారు 1.3 లక్షల హెక్టార్లలో అరటి సాగు జరుగుతోందని కడప, అనంతపురం, నంద్యాల, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అరటి కాండం నుంచి పీచు వెలికితీసే కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పీచును వస్త్రాలు, హస్తకళలు, జియోటెక్స్‌టైల్స్ తయారీలో వినియోగించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా గిరిజనులు, మెట్టప్రాంత రైతులకు ఉపాధి కల్పించేలా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వెదురు పీచు ప్రాసెసింగ్ యూనిట్లను, పోకచెక్క ఆధారిత పర్యావరణహిత ప్యాకేజింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్రంలో 1.1 లక్షల హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న కొబ్బరి సాగును దృష్టిలో ఉంచుకుని కోయిర్ బోర్డు, డ్వాక్రా నెట్‌వర్క్ సహకారంతో యాంత్రిక హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. రాష్ట్రానికి ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో మట్టి కోత నివారణకు, తీర రక్షణకు ఈ కొబ్బరి పీచుతో తయారుచేసే 'కోయిర్ జియోటెక్స్‌టైల్స్' ఎంతగానో ఉపయోగపడతాయని చంద్రబాబు వివరించారు.
ఇక ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర జౌళి రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ టెక్స్‌టైల్ పరిశ్రమను సందర్శించిన ఆయన పారిశ్రామికవేత్తలు అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ సగటు పత్తి దిగుబడి హెక్టారుకు 2,000 కిలోలు ఉండగా భారత్‌లో అది కేవలం 450 కిలోలుగా ఉండటం ఆందోళనకరమని ఉత్పాదకత పెంపు కోసం విత్తన విధానాల్లో మార్పులు తీసుకురావాలన్నారు. ఏపీ హ్యాండ్‌లూమ్ రంగానికి ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఇప్పటికే ఒక హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌కు ఆమోదం తెలపగా మరో క్లస్టర్ పరిశీలనలో ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, గ్రాఫీన్ వంటి నూతన రంగాల్లో కూడా రాష్ట్రం ముందంజలో ఉండాలని సూచిస్తూ త్వరలోనే విశాఖపట్నంలో గ్లాస్ ఫైబర్ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
