
‘మిషన్ గోదావరి క్లీన్’కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మిషన్ గోదావరి క్లీన్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పుష్కరాల నేపథ్యంలో పవిత్ర గోదావరి నదిని మున్సిపల్, పారిశ్రామిక కాలుష్యం నుంచి రక్షించేందుకు వీలుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిపుణుల బృందాన్ని అధ్యయనం కోసం ఏపీకి పంపేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ ప్రయోజనాలకు సంబంధించిన 8 కీలక విజ్ఞప్తులను కేంద్రం ముందుంచగా, అన్నింటికీ కేంద్ర మంత్రి నుంచి సానుకూల స్పందన లభించింది. ఏపీ అటవీ ప్రాంతంలో అంతరించిపోయిన అడవి దున్నల పునరుద్ధరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను రప్పించేందుకు కేంద్రం సహకరించింది. కేంద్ర మంత్రి చొరవతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వీటిని ఏపీకి పంపేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో జన్యుపరమైన లోపాలను నివారించడానికి 6 ఆడ పులులను రప్పించేందుకు ప్రతిపాదించారు. మహారాష్ట్ర నుంచి 4 (సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడారు), మధ్యప్రదేశ్ నుంచి 2 ఆడ పులులను ఏపీకి తీసుకురానున్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో బేస్ క్యాంపులను 90 నుంచి 150కి పెంచేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. దీనివల్ల 300 మంది స్థానిక చెంచు యువతకు అటవీ రక్షకులుగా (గార్డ్స్) ఉపాధి లభించనుంది. వారికి ద్విచక్ర వాహనాలు కూడా సమకూరుస్తారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్1,050 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి రక్షించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ‘మిస్టీ’ పథకం కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల దాడి నుంచి ప్రజలను రక్షించేందుకు ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను ఇప్పించేందుకు కేంద్రం అనుకూలంగా స్పందించింది.
ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరు చేసిన నూతన అటవీశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ ‘అరణ్యారామం’ (అరణ్యం భవన్) నిర్మాణానికి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనంలో హనుమాన్ మానిటరింగ్ సెంటర్ (మానవ-వన్యప్రాణి సంఘర్షణ నివారణ), గ్రేట్ గ్రీన్ వాల్ పర్యవేక్షణ, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్, స్టేట్ టైగర్ మానిటరింగ్ వంటి అత్యాధునిక విభాగాలు ఏర్పాటు కానున్నాయి.
భగీరథ ప్రయత్నమైన గోదావరి క్లీన్ ప్రాజెక్టు కోసం త్వరలోనే కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహకారాన్ని కూడా కోరనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
