
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. రూ.2,816 కోట్ల వ్యయంతో 47.60 కిలోమీటర్ల పొడవున బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి గుంటూరు జిల్లా రేపల్లె వరకు ఈ కొత్త రైల్వే మార్గం విస్తరించనుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిపాలనా అనుమతులు త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదంతో డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా సిద్ధమైందని వివరించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఆధునిక ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
