
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్: సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ పనులకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కీలక నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి, భారత సైన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనంతో పాటు నదీ తీర ప్రాంతాల అభివృద్ధికి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులకు కేంద్రం నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలు, సాంస్కృతిక కేంద్రాలు, ప్రపంచస్థాయి పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న నిరంతర సహకారం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ అనుమతులతో బాపూ ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త పర్యావరణ శోభను సంతరించుకోనున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ భారీ విగ్రహం, మ్యూజియం, లండన్ ఐ తరహా రాట్నం, సైక్లింగ్ ట్రాక్‌లు, బోటింగ్ సదుపాయంతో పాటు పలు పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిజైనింగ్, డీపీఆర్ ఇదివరకే సిద్ధమయ్యాయి. తాజాగా పనుల నిర్వహణకు రక్షణ శాఖఅనుమతులు మంజూరు చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 83.818 ఎకరాల రక్షణ శాఖ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
