
ఎన్నికల తరువాత బెంగాల్‌లో కేంద్ర బలగాలు:అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో రెండు నెలల పాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. సోమవారం బెహాలాలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో ఆయన ప్రసంగిస్తూ ఓటర్లు ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూలలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించిందని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల రక్షణ కోసం ఈ బలగాలు ఇక్కడే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీది గూండాలకు భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా వెళ్లి ఓటు వేయండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెహాలా పూర్వ, పశ్చిమ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థుల మద్దతుగా సాగిన ఈ రోడ్‌షోలో అమిత్ షాకు జనం నీరాజనాలు పలికారు.
అనంతరం చందన్‌నగర్‌లో జరిగిన సభలో షా మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రక్షిస్తున్నారని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ చొరబాటుదారులు, రాజకీయ హింసకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత దోషులను కఠినంగా శిక్షిస్తామని ఓటర్లను బెదిరించాలని చూసే గూండాలకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు.
మతపరమైన అంశాలపై స్పందిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని బహుభార్యత్వాన్ని అనుమతించబోమని అమిత్ షా ప్రకటించారు. రామమందిర వివాదాన్ని ప్రస్తావిస్తూ బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మించాలని కొందరు టీఎంసీ నేతలు భావిస్తున్నారని, కానీ బెంగాల్ భారత్‌లో అంతర్భాగమని ఇక్కడ అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. మొదటి దశలో 93 శాతం రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం మార్పుకు సంకేతమని రాష్ట్రాన్ని 'సోనార్ బంగ్లా గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
