Let's talk: editor@tmv.in
మత్స్య రంగాభివృద్ధికి కేంద్రం కార్యాచరణ… భీమవరం క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి

మత్స్య రంగాభివృద్ధికి కేంద్రం కార్యాచరణ… భీమవరం క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి

Panthagani Anusha
17 ఏప్రిల్, 2026

దేశీయ ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పీఎంఎంఎస్వై కింద అభివృద్ధి చేస్తున్న బ్రాకిష్‌వాటర్ ఆక్వాకల్చర్ క్లస్టర్ పురోగతిపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ గురువారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఎగుమతిదారులతో కలిసి ఆక్వా సాగులో ఎదురవుతున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీ ఆక్వా హబ్.. ఉత్పత్తిలో రికార్డులు

ఈ సందర్భంగా డాక్టర్ లిఖీ మాట్లాడుతూ దేశంలోనే చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం 64 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించడం గర్వకారణమని దేశ బ్లూ ఎకానమీలో ఏపీ వాటా కీలకమని కొనియాడారు. భీమవరం క్లస్టర్‌కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉంటుందని ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేపల వినియోగాన్ని పెంచేందుకు రక్షణ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలతో అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సాంకేతికతకు ప్రాధాన్యత.. ఐస్‌లాండ్‌తో భాగస్వామ్యం

ఆక్వా సాగులో నూతన ఒరవడిని సృష్టించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని తీసుకుంటున్నట్లు లిఖీ పేర్కొన్నారు. చేపల వ్యర్థాల వినియోగంపై ఐస్‌లాండ్‌తో త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని ఆయన ప్రతిపాదించారు. రైతులు కేవలం పాత పద్ధతులకే పరిమితం కాకుండా ఐఓటీ, బయోఫ్లాక్, నానో బబుల్ ఆక్సిజనేషన్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని సూచించారు. రైతులకు ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు దేశ, విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయాలని, సీఐబీఏ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.

రైతుల గోడు.. పరిష్కారానికి విన్నపాలు

సమీక్షా సమావేశంలో ఆక్వా రైతులు తమ క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. మేత (ఫీడ్) ఖర్చులు విపరీతంగా పెరగడం, నాణ్యమైన విత్తనం (సీడ్) లభ్యత లేకపోవడం మార్కెట్ ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉండటం తమను కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక పరికరాలపై సబ్సిడీలు పెంచాలని ఆక్వా రంగానికి విరివిగా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. చేపలను పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో చేర్చడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచవచ్చని సూచించారు.

ఎగుమతులే లక్ష్యం.. మౌలిక వసతులపై దృష్టి

దేశ సముద్ర ఆహార ఎగుమతులు 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 68,000 కోట్లకు చేరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ లక్ష్య సాధనలో భీమవరం వంటి క్లస్టర్లు కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం డాక్టర్ లిఖీ కల్ల గ్రామంలోని ఒక ప్రైవేట్ రొయ్యల ఫారాన్ని సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న ఐఓటీ ఆధారిత సాగు విధానాలను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 'ట్రేసబిలిటీ' మరియు నాణ్యతను పాటిస్తేనే విదేశీ మార్కెట్లలో మన రొయ్యలకు మంచి ధర లభిస్తుందని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.