
డిజిటల్ అరెస్ట్ మోసాలపై కేంద్రం కఠిన చర్యలు
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ చర్యలు చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా వాట్సాప్ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 9,400 ఖాతాలను నిషేధించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) సమగ్ర నివేదికను సమర్పించింది. ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, టెలికాం సంస్థలు, టెక్ కంపెనీలు, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కలిసి ఈ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
వాట్సాప్ తీసుకున్న చర్యలు
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రత్యేక విచారణ చేపట్టిన వాట్సాప్, నెట్‌వర్క్‌లను గుర్తించి మొత్తం వ్యవస్థపై చర్యలు తీసుకుంది. ప్రభుత్వ లేదా పోలీస్ లోగోలు ఉపయోగిస్తున్న నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించే ‘లోగో డిటెక్షన్’ వంటి కొత్త సాంకేతికతలను అమలు చేస్తోంది. ఇంకా, కొత్తగా సృష్టించిన అనుమానాస్పద ఖాతాల నుంచి కాల్స్ వస్తే యూజర్లకు హెచ్చరికలు ఇవ్వడం, అనుమానాస్పద కాలర్ల ప్రొఫైల్ ఫోటోలను ఆటోమేటిక్‌గా దాచడం వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టనుంది.
సిమ్ కార్డులపై కఠిన చర్యలు
డీవోటీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అనుమానాస్పద సిమ్ కార్డులను 2–3 గంటల్లో బ్లాక్ చేసే విధానం తీసుకురానున్నారు. అదనంగా, సిమ్ జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సిస్టమ్‌ను 2026 డిసెంబర్ నాటికి అమలు చేయాలని నిర్ణయించారు. సిమ్–బైండింగ్ అనే విధానం ద్వారా యాప్ పనిచేయడానికి కేవైసీ చేసిన సిమ్ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సిమ్ తొలగిస్తే లేదా మారిస్తే యాప్ పనిచేయదు. బ్యాంకులకు అనుమానాస్పద లావాదేవీలపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టాలని ఆర్‌బీఐ సూచించింది. దీంతో మనీ మ్యూల్ కార్యకలాపాలను అరికట్టవచ్చు.
సీబీఐ దర్యాప్తు
రూ.10 కోట్లకు పైగా నష్టం జరిగిన కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే గుజరాత్‌కు చెందిన రెండు కేసులు, ఢిల్లీలో రూ.22.92 కోట్ల మోసం కేసును నమోదు చేసింది. టెలికాం యూజర్ ఐడెంటిఫికేషన్ రూల్స్, బయోమెట్రిక్ సిస్టమ్ అమలును వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. అలాగే మోసపూరిత సిమ్ కార్డులను తక్షణం బ్లాక్ చేసే విధానాన్ని అమలు చేయాలని కోరింది.
