Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్ దిశగా కేంద్రం అడుగు.. ఏపీ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు

డీలిమిటేషన్ దిశగా కేంద్రం అడుగు.. ఏపీ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు

Panthagani Anusha
18 ఏప్రిల్, 2026

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు-2026పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అధికారిక యంత్రాంగం దీనిని చారిత్రక అవసరంగా అభివర్ణిస్తుండగా విపక్షాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ఇది ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ ప్రక్రియపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. డిలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదంటూ ఎన్డీఏ తరఫున ప్రధాని ఇచ్చిన హామీని ఆయన ప్రశంసించారు. ప్రతి రాష్ట్రానికి ఉన్న పార్లమెంట్ స్థానాల నిష్పత్తిలో సమతుల్యత దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న కేంద్రం మాటపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ‘ఎక్స్’ వేదికగా లోకేష్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం కూడా ప్రాతినిధ్యం కోల్పోదన్నది ‘ఎన్డీఏ గ్యారంటీ’ అని ఆయన ఉద్ఘాటించారు.

అయితే కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) విరుచుకుపడింది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. అధికార పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్ల సంఖ్యను పెంచుకునే కుట్ర జరుగుతోందని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ నిష్పక్షపాతాన్ని దెబ్బతీస్తుందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అనే అంశాన్ని కేవలం ఒక సాకుగా చూపి అసలు రాజకీయ అజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు దీనివల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణలో వెనుకబడిన హిందీ రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయని, దీనివల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం నుంచి 20 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని గణాంకాలతో సహా వివరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. డిలిమిటేషన్ ప్రక్రియ కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని ఇది భారత ప్రజాస్వామ్య ఆత్మను కాపాడే అంశమని శివాజీ పేర్కొన్నారు. కేంద్రం వెంటనే ఈ బిల్లుపై అన్ని వర్గాలతో చర్చించి పారదర్శకమైన విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని అయితే అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించాలని ఆయన సూచించారు.