Let's talk: editor@tmv.in
సీబీఎస్ఈ పది ‘రెండో బోర్డు’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సీబీఎస్ఈ పది ‘రెండో బోర్డు’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Shaik Mohammad Shaffee
24 ఏప్రిల్, 2026

సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు ఊరటనిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిన నూతన విధానంలో భాగంగా, రెండో విడత బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. మే 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మే 21తో ముగియనున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి సన్యం భార్ద్వాజ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే మొదటి విడత ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, వారం రోజుల వ్యవధిలోనే రెండో విడత తేదీలను బోర్డు ప్రకటించడం గమనార్హం.

ఏ తేదీ.. ఏ పరీక్ష?

వచ్చే నెల 15న గణితం (స్టాండర్డ్, బేసిక్) పేపర్‌తో పరీక్షలు మొదలవుతాయి. మే 16న ఇంగ్లీష్, 18న సైన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 19వ తేదీన హిందీ, ఉర్దూ, తెలుగుతో పాటు వివిధ ప్రాంతీయ, విదేశీ భాషలు, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు ఉంటాయి. మే 20న సంస్కృతం, పెయింటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇక చివరి రోజైన మే 21న సామాజిక శాస్త్రం (సోషల్ సైన్స్) పరీక్షతో ఈ విడత ముగుస్తుంది.

2026 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి కాగా, మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలు పూర్తిగా ఐచ్ఛికం. మొదటి విడతలో మార్కులు తక్కువగా వచ్చిన వారు తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ఈ అవకాశం కల్పించారు.

గరిష్టంగా మూడు సబ్జెక్టులు

ఈ రెండో బోర్డు పరీక్షలో విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టుల వరకు రాసేందుకు అవకాశం ఉంది. రెండు పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే, వాటినే తుది ఫలితాలుగా పరిగణిస్తారు. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వారి విద్యా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మార్గం సుగమమవుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.