
సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ప్రకటించిన 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఈసారి 93.70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 55 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు. బోర్డు తెలిపిన వివరాల ప్రకారం 2.20 లక్షలకుపైగా విద్యార్థులు 90 శాతం పైగా మార్కులు పొందారు. ఈసారి కూడా అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం: 94.99%, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం: 92.69%, ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం: 87.50శాతంగా నమోదైంది. ఈసారి 24.71 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు దేశవ్యాప్తంగా 8,074 కేంద్రాల్లో నిర్వహించారు.
ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు
95% పైగా మార్కులు: 55,368 మంది
90% పైగా మార్కులు: 2,21,574 మంది
కంపార్ట్‌మెంట్ కేటగిరీ: 1.47 లక్షలకుపైగా విద్యార్థులు
ప్రాంతాల వారీగా ఫలితాలు
ఈసారి తిరువనంతపురం, విజయవాడ ప్రాంతాలు అత్యధిక ఉత్తీర్ణత (99.79%) నమోదు చేశాయి.
అత్యల్ప ఉత్తీర్ణత శాతం గువాహటి ప్రాంతంలో (85.32%) నమోదైంది. ఢిల్లీ ప్రాంతం ఉత్తీర్ణత శాతం 97.38గా ఉంది. పాఠశాలల వారీగా చూస్తే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలలు – 99.57%, నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలు – 99.42%, ప్రైవేట్ పాఠశాలలు – 93.77%, ప్రభుత్వ సహాయ పాఠశాలలు – 91.01% ఉత్తీర్ణత సాధించాయి.
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల్లో 96.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో 91 మంది 95% పైగా, 452 మంది 90% పైగా మార్కులు సాధించారు.
ఈసారి ప్రత్యేక మార్పులు
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఫార్సుల మేరకు ఈ ఏడాది నుంచి 10వ తరగతి కోసం రెండు బోర్డు పరీక్షల విధానం ప్రవేశపెట్టారు. మొదటి పరీక్ష ఫిబ్రవరి–మార్చిలో నిర్వహించగా, రెండో పరీక్ష మే నెలలో జరుగనుంది.
నో మెరిట్ లిస్ట్
విద్యార్థుల్లో అనవసర పోటీని తగ్గించేందుకు మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. అయితే ప్రతి విషయంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 0.1% విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేట్ విద్యార్థుల డిజిలాకర్ ఖాతాల్లో అందుబాటులో ఉంటుంది.
