Let's talk: editor@tmv.in
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి: వైఎస్ జగన్

Gaddamidi Naveen
14 జూన్, 2026

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 16,000 పోస్టుల 'మెగా' డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ఒక పెద్ద కుంభకోణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఈ ‘మెగా స్కామ్’ ఒక పద్ధతి ప్రకారం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు శ‌నివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ మల్టీ-లేయర్డ్ కుంభకోణంపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకతను తుంగలో తొక్కి, వ్యవస్థాగత రక్షణలను ధ్వంసం చేసి ఈ అవినీతికి పాల్పడ్డారని జగన్ పేర్కొన్నారు. గతంలో డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ వేర్వేరుగా ఉండేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనబెట్టి, ఈ రెండు కీలకమైన బాధ్యతలను ఒకే ఒక్క అధికారిక సంస్థ అయిన ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించింది. అవకతవకలకు వీలుగానే ఈ మార్పులు చేశారని ఆయన ఆరోపించారు.

అత్యంత రహస్యంగా నిర్వహించాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్‌ ప్రక్రియలను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. ప్రశ్నపత్రాల ప్రక్రియతో సంబంధం ఉన్న ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి డీఎస్సీలో మొదటి ర్యాంకు సాధించడం ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపించారు. అనంతరం అతని వివరాలు మెరిట్‌ జాబితా నుంచి తొలగించబడటం, ధ్రువపత్రాల పరిశీలనకు పిలవకపోవడం వంటి పరిణామాలు మరిన్ని అనుమానాలకు కారణమయ్యాయని ఆయ‌న తెలిపారు.

ఫలితాల ప్రకటనా ప్రక్రియలో కూడా పూర్తి స్థాయి పారదర్శకత కనిపించలేదని జగన్ విమర్శించారు. గతంలో కలెక్టరేట్‌ నోటీస్‌ బోర్డులపై మెరిట్‌ జాబితాలు ప్రదర్శించేవారని, ఈసారి కేవలం ఆన్‌లైన్‌ ప్రక్రియకే పరిమితం కావడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన కొంతమంది అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితాలో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

క్రీడాకారుల కోటా విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం అత్యంత వివాదాస్పదమని జగన్ ఆరోపించారు. గతంలో జీఓ నెం. 74 ప్రకారం క్రీడా కోటా అభ్యర్థులకు కూడా డీఎస్సీ రాతపరీక్ష తప్పనిసరి. అయితే, చంద్రబాబు, లోకేష్‌లు కొత్తగా జీఓ నెం. 4, జీఓ నెం. 47లను తీసుకొచ్చి, చరిత్రలోనే మొదటిసారిగా క్రీడా కోటా అభ్యర్థులకు పరీక్ష రాయకుండానే నేరుగా ఉద్యోగాల్లోకి వచ్చేలా బ్యాక్‌డోర్ ఎంట్రీ కల్పించారు. తమకు కావాల్సిన వారిని నింపేసి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ జీఓ నెం. 23, 25, 56లను జారీ చేశారని జ‌గ‌న్ మండిపడ్డారు.

ఉపాధ్యాయ పోస్టుల కోసం డబ్బుల లావాదేవీలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటికీ, పోలీసులు కేవలం నామమాత్రపు కేసులు నమోదు చేసి సరిపెట్టారని జగన్ ఆరోపించారు. మొత్తం డీఎస్సీ వ్యవహారం బహుళస్థాయి అవినీతి, అక్రమాలతో నిండిపోయిందని, రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలకు నమ్మకం లేదని పేర్కొన్నారు. లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని జగన్‌ డిమాండ్ చేశారు.