Let's talk: editor@tmv.in
బిల్డర్లు–ఆర్థిక సంస్థల కేసులో.. ఎనిమిది రాష్ట్రాల్లో సీబీఐ దాడులు

బిల్డర్లు–ఆర్థిక సంస్థల కేసులో.. ఎనిమిది రాష్ట్రాల్లో సీబీఐ దాడులు

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

బిల్డర్లు, ఆర్థిక సంస్థల మధ్య ఉన్న సంబంధాల కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) మంగళవారం దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో విస్తృతంగా దాడులు చేపట్టింది. ఈ కేసులో తాజాగా 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన అనంతరం మొత్తం 77 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలు ఢిల్లీ, చెన్నై, పుదుచ్చేరి, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించారు. కొంతమంది బిల్డర్లు, ఆర్థిక సంస్థల అధికారుల మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాల కారణంగా అమాయకులైన గృహ కొనుగోలుదారులు మోసపోయారని సీబీఐ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల ఉద్దేశం గృహ నిర్మాణ రంగంలో జరిగిన నిధుల మళ్లింపు, ఆర్థిక అవకతవకలు, మోసపూరిత కార్యకలాపాల వెనుక ఉన్న పెద్ద కుట్రను బయటపెట్టడమేనని సీబీఐ పేర్కొంది. ఈ కేసును గత ఏడాది సుప్రీం కోర్టు సీబీఐకు అప్పగించింది. 2025 ఏప్రిల్ 29న కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉన్న పలు బిల్డర్లపై ప్రాథమిక విచారణలు ప్రారంభించారు. వీటిలో సూపర్‌‌టెక్‌ లిమిటెడ్‌ కూడా ఉంది. తరువాత ఎన్‌సీఆర్‌లో ‘సబ్‌వెన్షన్ స్కీమ్’ పేరుతో గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసుల్లో 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇంకా గత ఏడాది సెప్టెంబర్ 23న ముంబై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ప్రయాగ్‌రాజ్ నగరాల్లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించి బ్యాంకులు, డెవలపర్ల మధ్య ఉన్న సంబంధాలపై మరో ఆరు కేసులు నమోదు చేయడానికి కూడా కోర్టు అనుమతిచ్చింది. తాజాగా నమోదైన 22 కేసులతో కలిపి ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 50కు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ బిల్డర్లపై ఈ కొత్త కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తన ప్రకటనలో తెలిపింది.