Let's talk: editor@tmv.in
సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు..మధు కిష్వార్‌‌పై కేసు నమోదు

సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు..మధు కిష్వార్‌‌పై కేసు నమోదు

Pinjari Chand
22 ఏప్రిల్, 2026

సోషల్ మీడియాలో తప్పుడు, మిస్‌ లీడింగ్‌ కంటెంట్‌ ప్రచారం చేశారనే ఆరోపణలపై విద్యావేత్త మధు కిష్వార్‌పై చండీగఢ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు, కిష్వార్‌తో పాటు మరికొందరు సోషల్ మీడియా యూజర్లపై పలు సెక్షన్ల కింద, అలాగే ఐటీ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు నగరంలోని సెక్టర్‌-26 పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. చండీగఢ్‌ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏప్రిల్‌ 19న ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తూ, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు నకిలీ, నెటిజన్లను తప్పుదారి పట్టించే పోస్టులు, అసభ్య పదజాలంతో కూడిన వీడియో క్లిప్‌లను షేర్ చేస్తూ, వీడియోలో ఉన్న వ్యక్తిని తప్పుగా గుర్తిస్తున్నారని ఆరోపించారు.

ఫిర్యాదుదారు ప్రకారం, ఈ పోస్టులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు రికార్డులు సృష్టించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా రూపొందించారు. ఇవి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించడం, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించడం లక్ష్యంగా అవి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఓ ట్రావెల్‌ వ్లాగర్‌ అని, అతని భార్య తన సోషల్ మీడియా ఖాతాలో అసలు వీడియోను షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రకటన ప్రకారం వీడియోలో ఉన్న వ్యక్తి ఆమె భర్తేనని వెల్లడించిందని, ఆ వ్యక్తి , వీడియోలో కనిపించిన మరో మహిళ వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, కిష్వార్‌ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందిస్తూ, సోమవారం అర్ధరాత్రి సమయంలో చండీగఢ్‌ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారని తెలిపారు. చట్టం ప్రకారం రాత్రి సమయంలో మహిళల వద్దకు పోలీసులు రావడం, అరెస్ట్‌ చేయడం నిషేధమని పేర్కొంటూ, ఉదయం రావాలని పోలీసులకు సూచించినట్లు ఆమె వెల్లడించారు.