
ఆర్మూర్‌లో ప్రైవేట్ పాఠశాలపై కేసు.. అనుమతి లేకుండా ఉర్దూ బోధన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యప్రణాళికలో లేకపోయినప్పటికీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక హిందీ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 27న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ వివాదంపై బీజేపీ, పలు హిందూ సంఘాల కార్యకర్తలు పాఠశాల వద్ద తీవ్ర నిరసనలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలను సందర్శించి సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు.
ప్రభుత్వ ముందస్తు అనుమతులు లేకుండా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఉర్దూ బోధించడంతో పాటు నమాజ్ నేర్పుతున్నారంటూ స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఉర్దూ బోధించడం చట్టవిరుద్ధమని, దీనిపై విద్యాశాఖ కూడా అంతర్గత విచారణ జరుపుతోందని అధికారులు తెలిపారు. పాఠశాల ఆవరణలోకి అక్రమంగా చొరబడి, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ పాఠశాల కరస్పాండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిరసన తెలిపిన పలువురు కార్యకర్తలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆర్మూర్ లోని ఈ ఒకే క్యాంపస్‌లో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. 'భవిష్య దర్శిని' పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు, 'భారత్ చంద్ర' పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో.. తమకు పాఠశాలలో ప్రతిరోజూ ఉర్దూ బోధిస్తున్నారని, నోట్స్ కూడా రాయిస్తున్నారని ప్రాథమిక తరగతుల విద్యార్థులు స్పష్టం చేయడం కనిపించింది. మరోవైపు, హిందూ సంఘాల కార్యకర్తలు స్కూల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, దాడి చేస్తున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ వివాదంపై తహశీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే విద్యార్థులకు ఉర్దూ నేర్పుతున్నట్లు తేలిందని చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రిన్సిపాల్ కూడా ఇందుకు సహకరించినట్లు గుర్తించామన్నారు. నిబంధనల ఉల్లంఘనపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
