Let's talk: editor@tmv.in
బండి భగీరథ్‌‌పై కేసు.. తక్షణమే విచారణ ప్రారంభించాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బండి భగీరథ్‌‌పై కేసు.. తక్షణమే విచారణ ప్రారంభించాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Gaddamidi Naveen
12 మే, 2026

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పేట్‌ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ కేసులో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 8నే ఫిర్యాదు అందినప్పటికీ, నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి డీజీపీని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. గత రెండు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నందున, పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని, ఆ కారణంగానే దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. కేసు వివరాలను ఈ సందర్భంగా సీఎంకు ఆయన వివరించారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా రాజీ పడకుండా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు వేగవంతం కానుంది.

ఇక‌ ఓ బాధితురాలి తల్లి తన కుమార్తెను భగీరథ్‌ వేధిస్తున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్‌ పోలీసులు సెక్షన్ 11, 12 ఆఫ్‌ పోక్సో యాక్ట్, బీఎన్‌ఎస్‌ 74, 75 సెక్షన్ల కింద ఈనెల 8న‌ కేసు నమోదు చేశారు. మరోవైపు బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని బండి భగీరథ్‌ కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.