
పాస్‌పోర్ట్ ఇవ్వలేం..సేతల్వాద్‌కు సుప్రీం షాక్
సామాజిక కార్యకర్త తీస్తా సేతల్వాద్ తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే విదేశాలకు వెళ్లాల్సిన స్పష్టమైన ప్రణాళికను సమర్పించిన తర్వాత మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. జస్టిస్‌లు దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మ, అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ దరఖాస్తును విచారించింది. మీరు ఎక్కడికి, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడు మాత్రమే పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలా అనే విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సేతల్వాద్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అవసరమని వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని సాధారణంగా ఆదేశించలేం. మీరు ప్రయాణానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇవ్వాలని తెలిపింది.
బెయిల్ షరతులే అడ్డంకి
2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసుల్లో పత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో సేతల్వాద్‌కు 2023 జూలై 19న సుప్రీంకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆమె పాస్‌పోర్ట్‌ను సెషన్స్ కోర్టు కస్టడీలో ఉంచాలనే షరతు విధించింది. అదే సమయంలో, గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు ‘విపరీతమైనది’, ‘పరస్పర విరుద్ధమైంది’గా అభివర్ణిస్తూ రద్దు చేసింది. ఛార్జిషీట్ ఇప్పటికే దాఖలైందని, సాక్ష్యాలు ఎక్కువగా పత్రాల రూపంలో ఉన్నాయని పేర్కొంటూ కస్టడీ విచారణ అవసరం లేదని తెలిపింది.
జాకియా జాఫ్రీ కేసు నేపథ్యం
ఈ కేసు మూలం జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించినది. 2002 గుజరాత్ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నివేదికను సవాలు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై అప్పీల్ చేశారు.సుప్రీంకోర్టు 2022 జూన్ 24న ఇచ్చిన తీర్పు తర్వాత, ఈ వ్యవహారంలో ప్రక్రియను దుర్వినియోగం చేశారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ సేతల్వాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్‌భట్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ.శ్రీకుమార్‌లపై కూడా కేసులు నమోదు చేశారు.
