
నీట్ రద్దు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: కేటీఆర్
నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పగలు, రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ఈ సందర్భంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం వల్లే మళ్లీ పేపర్ లీకైందని ఆరోపించారు. 2024లో జరిగిన లీకేజీ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఈ ఘటన పునరావృతమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న లోపాలు విద్యార్థులకు శాపంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. పరీక్షకు ముందు రోజే వందకు పైగా ప్రశ్నలు లీక్ కావడం వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోందని ఆయన విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్షకు హాజరైన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. లీక్ వెనుక ఎంత పెద్దవాళ్ల పాత్ర ఉన్నా వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన కోరారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. చివరగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
