
'రోహిత్ వేముల బిల్లు' కోసం కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు
ఉన్నత విద్యా సంస్థల్లో కుల, గుర్తింపు ఆధారిత వివక్షను అరికట్టడమే ధ్యేయంగా ప్రతిపాదించిన 'రోహిత్ వేముల చట్టం' పై తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా, సిఫార్సులను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. "రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026"ను పటిష్టంగా రూపొందించడానికి ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
కమిటీ వివరాలు
చైర్మన్:
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
సభ్యులు:
మంత్రులు శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సి. దామోదర రాజనర్సింహ.
కన్వీనర్:
ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ ఉపసంఘం వీలైనంత త్వరగా తన నివేదికను, సూచనలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని జీవో లో పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల 2016లో కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యా సంస్థల్లో ఇటువంటి వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' తీసుకురావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
కాగా, ఏప్రిల్ 16న కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే తరహా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యలో సామాజిక సమానత్వం సాధించడానికి ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
