Let's talk: editor@tmv.in
విద్యుత్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

విద్యుత్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Gaddamidi Naveen
5 మే, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణల నుంచి భూముల ధరల క్రమబద్ధీకరణ వరకు కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ సమర్పించిన 114 పేజీల నివేదికను కేబినెట్ సమగ్రంగా పరిశీలించింది. ఈ వ్యవహారంలో అంతర్రాష్ట్ర అంశాలు ఉండటం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉండటంతో, నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భూముల ధరల సవరణ

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భూముల మార్కెట్ విలువను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. వాస్తవ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో శాస్త్రీయ పద్ధతిలో ధరలను సవరించనున్నారు. ఈ నెల చివరి వారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు చెల్లించే పరిహారం విషయంలో కూడా ధరలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల ధరలు పెరగకముందే ‘హిల్ట్‌’ పాలసీ కింద దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిస్తూ, పాత ధరలకే 10 శాతం ముందస్తుగా చెల్లించి, మిగిలిన 90 శాతాన్ని 90 రోజుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు.

రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో, అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, టీ-శాట్ నెట్‌వర్క్‌ను ఇకపై 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ ఒకే గొడుగు కింద పకడ్బందీగా కొనసాగుతుంది.

రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయి వివరాలు సేకరించి రైతులకు భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ఉత్పత్తి రంగంలో భాగంగా నల్గొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు అప్పగిస్తూ ఎంఓయూకు ఆమోదం తెలిపారు. ఇకపై ప్లాంట్ నిర్వహణ, మార్కెటింగ్ బాధ్యతలను ఎన్‌డీబీ చూసుకుంటుంది. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో అత్యాధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం 42 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇక శక్తి రంగంలో, తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల సమీపంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్టుగా 18 ప్రాంతాల్లో సుమారు రూ.66.50 కోట్ల వ్యయంతో 19 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. అదేవిధంగా క్యూర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ కార్యాలయాలకు పెండింగ్‌లో ఉన్న పన్నులను చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు ఆమోదం లభించింది.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, లక్ష్మణ్ కుమార్ ఈ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజారోగ్యం, విద్యుత్ పారదర్శకత, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వారు పేర్కొన్నారు.