Let's talk: editor@tmv.in
బీహార్ లో మంత్రి వర్గ విస్తరణ: 32 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
బీహార్ లో మంత్రి వర్గ విస్తరణ: 32 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

బీహార్ లో మంత్రి వర్గ విస్తరణ: 32 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

Dantu Vijaya Lakshmi Prasanna
8 మే, 2026

బీహార్ రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన భారీ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన 32 మంది నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

నిశాంత్ కుమార్ రంగప్రవేశం

ఈ మంత్రివర్గ విస్తరణలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం. నితీష్ కుమార్ గత నెలలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో, ఆయన వారసుడిగా నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం బీహార్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ నిశాంత్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కానున్నారు.

బీజేపీ నేతృత్వంలోని తొలి ప్రభుత్వం

బీహార్ రాజకీయ చరిత్రలో ఇది ఒక అరుదైన సందర్భం. రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. 243 స్థానాలున్న అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన, బీజేపీ, ఈ కేబినెట్ విస్తరణలో సింహభాగాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన కార్యక్రమంలో , బీజేపీ నుండి 15 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర పాలనలో, బీజేపీ పట్టును మరింత బలపరిచింది.

కూటమిలోని పార్టీలకు సమ ప్రాధాన్యత

ఐదు పార్టీల ఎన్డీయే కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు ఈ మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుండి మొత్తం 15 మంది మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, గురువారం 13 మంది ప్రమాణం చేశారు. ఏప్రిల్‌లోనే విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ వంటి వారు ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కూటమిలోని ఐక్యతను చాటిచెబుతూ అందరికీ ప్రాధాన్యత దక్కేలా చూశారు.

వారసుల ప్రాతినిధ్యం - కీలక నేతలు

ఈ విస్తరణలో కేవలం నిశాంత్ కుమారే కాకుండా, ఇతర అగ్రనేతల వారసులకు కూడా చోటు దక్కింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుండి సంజయ్ కుమార్ సింగ్, సంజయ్ కుమార్ పాశ్వాన్ మళ్ళీ మంత్రి పదవులు పొందారు. అలాగే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, ఉపేంద్ర కుష్వాహా పార్టీ నుండి దీపక్ ప్రకాష్ కూడా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

పాట్నాలో నిర్వహించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు, పలువురు నేతలు నూతన మంత్రులను అభినందించారు. గత ఏడాది నవంబర్‌లో ఏర్పడిన నితీష్ కేబినెట్‌లోని మెజారిటీ నాయకులకే ఈ కొత్త ప్రభుత్వంలోనూ అవకాశం దక్కింది.

కొత్త మంత్రుల రాకతో రాష్ట్రంలో పాలన వేగం పుంజుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. , బీజేపీ, జేడీయూ సమన్వయంతో సాగే ఈ ప్రభుత్వం బీహార్ అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిశాంత్ కుమార్ వంటి యువ నాయకుల చేరికతో యువతకు ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే, వివిధ పార్టీల కలయికతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తుందో వేచి చూడాలి.