
గన్నవరానికి రూ.200 కోట్లతో ‘సి-డాక్’ కేంద్రం
గన్నవరం నియోజకవర్గాన్ని ఐటీ ఉపాధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్’ (సి-డాక్) కేంద్రాన్ని గన్నవరంలో ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ వేగవంతమైంది. ఈ మెగా ప్రాజెక్టు సాధన నిమిత్తం మంగళవారం రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇటీవల సి-డాక్ ఉన్నతాధికారుల బృందం గన్నవరంలో పర్యటించి కేంద్రం ఏర్పాటుకు జరిపిన స్థల పరిశీలన ప్రాథమిక చర్చల వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నారా లోకేష్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో తాను స్వయంగా మాట్లాడి ఈ ప్రాజెక్టు మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
అయితే ఈ ప్రాజెక్టు గనుక మంజూరైతే దేశంలోనే 13వ సి-డాక్ కేంద్రంగా గన్నవరం నిలవనుంది. సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. ఈ నిధుల అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుండటం విశేషం.
ఇక మంత్రి లోకేష్‌తో సమావేశం అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ సి-డాక్ రాకతో స్థానిక నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరంలో సి-డాక్ ఏర్పాటయ్యాక ఇక్కడి స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్ డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వీఎల్ఎస్ఐ వంటి అత్యాధునిక అడ్వాన్స్‌డ్ సాంకేతిక విభాగాల్లో నిపుణులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి గ్లోబల్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తామన్నారు.
