Let's talk: editor@tmv.in
బుసాన్ ఓపెన్ విజేత అనిరుధ్ జోడీ
బుసాన్ ఓపెన్ విజేత అనిరుధ్ జోడీ

బుసాన్ ఓపెన్ విజేత అనిరుధ్ జోడీ

Shaik Mohammad Shaffee
20 ఏప్రిల్, 2026

భారత టెన్నిస్ ఆటగాడు అనిరుధ్ చంద్రశేఖర్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. దక్షిణ కొరియాలో జరిగిన 'బుసాన్ ఓపెన్-2026' ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తన జపాన్ భాగస్వామి టేకెరు యుజుకితో కలిసి ఆడిన అనిరుధ్, ఆదివారం జరిగిన తుది పోరులో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేశాడు. ఈ విజయంతో అనిరుధ్ తన కెరీర్‌లో 10వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

ఫైనల్లో అద్భుత పోరాటం

రెండో సీడ్‌గా బరిలోకి దిగిన అనిరుధ్ - యుజుకి జంట.. ఫైనల్లో మూడో సీడ్ నెదర్లాండ్స్-అమెరికా జంట జీన్-జూలియన్ రోజర్, థియోడర్ వైన్‌గర్‌లతో తలపడింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ, భారత-జపాన్ జోడీ అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించింది. తొలి సెట్‌ను 4-6తో కోల్పోయిన అనిరుధ్ ద్వయం, రెండో సెట్‌లో పుంజుకుని 6-3తో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. నిర్ణయాత్మకమైన సూపర్ టైబ్రేకర్ లో 10-7 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఒక గంటా 49 నిమిషాల పాటు ఈ పోరు సాగింది.

ఫైనల్ వరకు సాగిన ప్రయాణం

ఈ టోర్నీలో అనిరుధ్ జోడీ ప్రస్థానం అత్యంత సాఫీగా సాగింది. తొలి రెండు రౌండ్లలో స్థానిక వైల్డ్ కార్డ్ జంట సుక్ ఆన్-గన్-జున్ కిమ్ (దక్షిణ కొరియా)తో పాటు బ్రిటన్‌కు చెందిన బెన్ జోన్స్-జోషువా పారిస్ జంటలపై వరుస సెట్లలో విజయాలు సాధించారు. అయితే, సెమీఫైనల్‌లో మాత్రం స్వదేశీ ఆటగాళ్లు రిత్విక్ బొల్లిపల్లి - అర్జున్ కాధే జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆ మ్యాచ్‌లో కూడా సూపర్ టైబ్రేకర్ వరకు పోరాడి అనిరుధ్ జంట ఫైనల్‌కు దూసుకెళ్లింది.

కెరీర్‌లో మైలురాయి

అనిరుధ్ చంద్రశేఖర్‌కు ఈ ఏడాది (2026)లో ఇదే తొలి టైటిల్. అలాగే టేకెరు యుజుకితో కలిసి గెలిచిన మొదటి ట్రోఫీ కూడా ఇదే. గతంలో వీరు నాంతబురి ఛాలెంజర్-II ఫైనల్‌కు చేరినప్పటికీ, భారత ఒలింపియన్ శ్రీరామ్ బాలాజీ జోడీ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. గతేడాది (2025)లో నాలుగు ఏటీపీ టైటిళ్లతో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అనిరుధ్, తాజా బుసాన్ విజయంతో తన డబుల్స్ టైటిళ్ల సంఖ్యను డబుల్ డిజిట్ (10)కు చేరవేసి కొత్త మైలురాయిని అధిగమించాడు.

ఓయిరాస్ ఓపెన్ డబుల్స్ విజేతగా బాలాజీ జోడీ

పోర్చుగల్‌లో జరిగిన ఓయిరాస్ ఓపెన్-3 ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ శ్రీరామ్ బాలాజీ, తన ఆస్ట్రియా భాగస్వామి నీల్ ఓబెర్‌లీట్‌నర్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో ఈ జంట 6(9)-7(7), 6-4, 11-9తో కొలంబియా-ఉరుగ్వే జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ, అద్భుతంగా పుంజుకుని సూపర్ టైబ్రేకర్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని విజేతగా నిలిచారు.

బాలాజీ కెరీర్‌లో ఇది 18వ ఛాలెంజర్ టైటిల్ కాగా, ఈ ఏడాదిలో వీరిద్దరికీ ఇది నాలుగో ట్రోఫీ. గతంలో బ్యాంకాక్, మనమా, ఫ్రాన్స్‌లలో హార్డ్ కోర్టుపై టైటిళ్లు సాధించిన ఈ జోడీకి, క్లే కోర్టుపై ఇదే మొదటి విజయం కావడం విశేషం. ఈ విజయంతో పారిస్ ఒలింపియన్ బాలాజీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డాడు.