Let's talk: editor@tmv.in
పంజాబ్‌లో బస్సు ప్రమాదం.. 8 మంది యాత్రికులు మృతి

పంజాబ్‌లో బస్సు ప్రమాదం.. 8 మంది యాత్రికులు మృతి

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

పంజాబ్‌లోని ఫతేహ్‌గఢ్ సాహిబ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, మరో 19 మంది గాయపడ్డారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సీ పఠానా పరిధిలోని హిమ్మత్‌పురా సమీపంలో మోరిందా–చున్నీ రోడ్డుపై జరిగింది. బైసాఖీ సందర్భంగా ఆనందపూర్‌‌ సాహిబ్‌లో ప్రార్థనలు చేసి తిరిగి వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఫతేహ్‌గఢ్ సాహిబ్ జిల్లాలోని మైన్ మజ్రీ గ్రామానికి చెందినవారని సమాచారం.

మృతుల సంఖ్య పెరుగుదల

ప్రాథమికంగా ఈ ఘటనలో ఒక మహిళ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. తరువాత ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 8కు చేరిందని పోలీసులు తెలిపారు.

పలువురికి గాయాలు

గాయపడిన వారిని ఫతేహ్‌గఢ్ సాహిబ్, బస్సీ పఠానా, అలాగే మోరిందా ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌‌), ఛండీగఢ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి కారణం?

ప్రాథమికంగా బస్సులో యాంత్రిక లోపం ఏర్పడటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో వారు సహకరించారు.

సంతాపం తెలిపిన నేతలు

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్‌‌సింగ్‌ రాజా వర్రింగ్‌ కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. అలాగే శిరోమణి అకాలి దళ్ నాయకుడు బిక్రం సింగ్‌ మజిథియా మృతులకు నివాళి అర్పించి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.