
అప్పుల భారం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి రైతు ఆత్మహత్య
తీరని అప్పుల భారం, అనారోగ్య సమస్యలు ఒక నిండు సంసారాన్ని చిన్నాభిన్నం చేశాయి. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ బంధాల నుంచి విముక్తి కాలేక ఓ రైతు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టాడు. కన్నపిల్లలను, కట్టుకున్న భార్యను కడతేర్చి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘన్‌పూర్ మండలం సల్కిలాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నరసింహ (40) అనే వ్యక్తి తన జీవనోపాధి కోసం సల్కిలాపూర్ గ్రామంలో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. తన భార్య హేమలత (35), కుమార్తె సాయిశ్రీ, కుమారుడు సాయినిహాల్‌లతో కలిసి ఆ తోటలోనే నివసిస్తూ సాగు చేసుకుంటున్నాడు. అయితే మామిడి తోట సాగు కోసం నరసింహ దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో రాబడి లేకపోవడం దీనికి తోడు తోడుగా ఆరోగ్య సమస్యలు తోడవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 1 గంట నుంచి 1:30 గంటల మధ్య కాలంలో నరసింహ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర మనస్తాపంలో ఉన్న అతడు మొదట తన భార్య హేమలతను, ఇద్దరు పిల్లలను అక్కడే ఉన్న నీటి సంప్‌లోకి తోసివేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం తాను కూడా అక్కడే ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన బాలుడి చేతులు కట్టేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులు తీవ్ర కలవరానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, పిల్లలు నీటిలో మునిగి మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
సెల్ఫీ వీడియోలో ముగ్గురి పేర్లు?
ఇదిలాఉండగా ఆత్మహత్యకు పాల్పడటానికి ముందే నరసింహ తన మొబైల్ ఫోన్‌లో ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పులు తీర్చాలంటూ కొందరు వ్యక్తులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వేధింపులకు కారణమైన ముగ్గురు వ్యక్తుల పేర్లను కూడా అతడు ఆ వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఒంటిచేత్తో సంసారాన్ని నడుపుకుంటూ అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో సల్కిలాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
