

జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం: కేటీఆర్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఏప్రిల్ 20న జగిత్యాలలో నిర్వహించనున్న "ప్రజా ఆశీర్వాద సభ" ప్రాంగణాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. జీవన్‌రెడ్డిని కలిసిన అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
జగిత్యాల గడ్డ నుంచే బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి ఇక్కడి ప్రజలు కదం తొక్కబోతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు ఏడాది విరామం తర్వాత కేసీఆర్ బహిరంగ సభకు వస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన తెలిపారు. కేసీఆర్ సభపై ప్రజల్లో అపారమైన ఆసక్తి కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ సభకు సమాంతరంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పోతున్నారని వ్యాఖ్యానించారు, మీడియా దృష్టిని మళ్లించే ప్రయత్నమని విమర్శించారు. అలాగే సభకు వచ్చే ప్రజలను అడ్డుకునేందుకు కోరుట్ల నుంచి రాకుండా ఇప్పుడు రోడ్డు తవ్వుతున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ప్రజల్లోకి వస్తుంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
కానీ ఇలాంటి చర్యలతో బీఆర్ఎస్ ప్రజాదరణను తగ్గించలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో జగిత్యాలలో జరిగినట్లే ఈ సభ కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేస్తూ సభను విజయవంతం చేస్తుందని తెలిపారు. సభ ఏర్పాట్లలో భాగంగా భారీ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. దాదాపు మూడు లక్షల నీటి బాటిల్స్, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సాయంత్రం 5:30 గంటలకు సభకు హాజరవుతారని, ఎండ తగ్గిన తర్వాతే సభ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం కోసం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జీవన్ రెడ్డి చేరిక
సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో చేరుతుండటాన్ని స్వాగతిస్తున్నామని, ఎల్. రమణ, వసంత వంటి స్థానిక నేతలు సంస్కారంతో కొత్తవారిని ఆహ్వానిస్తున్నారని కేటీఆర్ అభినందించారు. హరీష్ రావు స్వయంగా వెళ్లి వారిని ఆహ్వానించడం పార్టీలోని ఐక్యతకు నిదర్శనమన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగిత్యాల సభ చరిత్ర సృష్టిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణను అవమానిస్తే సహించం: కేంద్రంపై హరీశ్ రావు ధ్వజం
అనంతరం, మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. "రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి" అనే నినాదం ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతుండటం ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త బలాన్ని ఇస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో జరిగిన పరిణామాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థనను ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రజాస్వామికంగా ఏర్పడిన రాష్ట్రాన్ని కించపరచడంపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని, అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే దీటైన సమాధానం ఇచ్చేవాళ్లమని అన్నారు. రాజ్యసభలో మన ఎంపీలు కేంద్ర మంత్రికి అడ్డుతగిలి రికార్డులను సవరించిన విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న రహస్య బంధం బయటపడిందని, కార్యకర్తలు కొట్టుకుంటుంటే ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో బీజేపీ మంత్రితో విందు ఆరగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి మహిళలకు ద్రోహం చేశాయని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే మహిళా కోటాపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన చరిత్ర తమదని, కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఆయన స్పష్టం చేశారు.
