
బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు.. అదో విప్లవం: కేటీఆర్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక "విప్లవం" అని ఆయన అభివర్ణించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. ఉడికే రక్తం.. ఎగిరే జెండా.. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పునర్జన్మ సందర్భం ఇది! ఆత్మగౌరవ రాజకీయ అస్తిత్వ జెండా గర్వంగా రెపరెపలాడుతోంది. రజతోత్సవ సంబరాల వేళ, పాతికేళ్ల మైలురాయిని దాటిన ఈ సుదీర్ఘ పోరాటం అద్భుతం. బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు, అదొక విప్లవం" అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అలుపెరగని పోరాటాలతో డిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని కొనియాడారు. గడిచిన పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి విముక్తి కల్పించి, పార్టీని మళ్లీ విజయపథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రస్థానం కేవలం రాజకీయాల కోసం కాదని, తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటమని ఆయన పేర్కొన్నారు.
పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి
కవిత కొత్త పార్టీ ప్రకటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. "రాజకీయాల్లో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. అది పెద్ద విషయమేమీ కాదు. దేశంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో కేవలం టీడీపీ, బీఆర్‌ఎస్ (గతంలో టీఆర్‌ఎస్) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాయి. కాబట్టి కొత్త పార్టీల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఆ పార్టీ బీఆర్‌ఎస్‌కు దానివల్ల వచ్చే నష్టమేమీ లేదని, అదొక పెద్ద సమస్యే కాదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన పనిలేదని ఆయన తెలిపారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. తేజస్వి సూర్య తనకు ఫోన్ చేసి తన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తప్పుగా అర్థం చేసుకుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని కేటీఆర్ వెల్లడించారు. మీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని నేను ఆయనకు స్పష్టం చేశాను అని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వైఖరిని ఆయన విమర్శించారు. ఒకవేళ పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీ ఉండి ఉంటే తక్షణమే దీటుగా బదులిచ్చేవారని ఆయన గుర్తుచేశారు.
పార్టీ పునర్నిర్మాణంపై కేసీఆర్ దిశానిర్దేశం
ఆవిర్భావ దినోత్సవ సభలో కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని కేటీఆర్ వివరించారు. పార్టీని సమూలంగా పునర్నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ కమిటీ మినహా మిగిలిన అన్ని పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త కమిటీలను నియమిస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పెద్ద ఎత్తున చేపడతామని, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కూడా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు గడిచిన దశాబ్ద కాలం దేశానికే అభివృద్ధి పాఠాలు నేర్పిందని ఆయన కొనియాడారు. తెలంగాణ అనేక మైలురాళ్లను అధిగమించిందని, అయితే గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన విమర్శించారు.
పార్టీ ప్రస్థానం
ఏప్రిల్ 27, 2001న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో ఈ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఈ ప్రయాణంలో, రాష్ట్రం ఏర్పడ్డాక 2022లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశంతో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. ప్రస్తుతం పార్టీ తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకుని 26వ ఏట అడుగుపెట్టింది.
మరో కీలక పరిణామం
ఇదిలా ఉండగా, శనివారం మాజీ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఏడు నెలల తర్వాత, ఆమె హైదరాబాద్‌లో తన కొత్త పార్టీని 'తెలంగాణ రాష్ట్ర సేనస (టీఆర్ఎస్) గా నామకరణం చేయడం విశేషం. కేసీఆర్ గతంలో తన పార్టీకి పెట్టిన పేరు 'తెలంగాణ రాష్ట్ర సమితి' కి దగ్గరగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
