
బీఆర్ఎస్ తన ఆత్మను కోల్పోయింది: కవిత
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) తన ప్రాథమిక సిద్ధాంతాలను, ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ, తెలంగాణ ఆకాంక్షల నెరవేర్చే దిశగా ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ప్రకటించారు.
మీడియాతో మాట్లాడిన కవిత, తాను బీఆర్ఎస్ నుంచి స్వచ్ఛందంగా బయటకు రాలేదని, తనను తన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షల కోసం ఏర్పడింది. కానీ వారు పేరు మార్చి, పనితీరు మార్చి, పార్టీ ఆత్మను చంపేశారు. దీనివల్ల ప్రజలతో ఉన్న అనుబంధం తెగిపోయింది. సిద్ధాంతాలకు దూరమైన ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అని ఆమె పేర్కొన్నారు.
కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం
తన తండ్రి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నుండే తనను బహిష్కరించినప్పటికీ, తాను తెలంగాణ బిడ్డగా వెనకడుగు వేయబోనని ఆమె తెలిపారు. నా ఒంట్లో తెలంగాణ రక్తం ఉంది, ఆ మొండితనం ఉంది. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మా పాత పార్టీ ఉన్నా లేకున్నా, నా కుటుంబం నాతో ఉన్నా లేకున్నా.. తెలంగాణ ప్రజలే నా కుటుంబం. ఈ మట్టి వాసనే నన్ను ముందుకు నడిపిస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు.
వ్యక్తిగత అజెండా కాదు.. ప్రజా అజెండా
తమ పార్టీ కేవలం పదవుల కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని కవిత తెలిపారు. బీజేపీ నన్ను జైలుకు పంపినా, బీఆర్ఎస్ నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసినా.. ఆ బాధలు నన్ను మరింత దృఢంగా మార్చాయి. నా లక్ష్యం వ్యక్తిగత ప్రతీకారం కాదు, ప్రజల అజెండా మాత్రమే అని ఆమె అన్నారు. తనను వైఫల్యాలతో పోల్చడం కుట్రలో భాగమని, మహిళలు ముందుకు వచ్చి విజయవంతమైన నాయకులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను నిరాశపరిచాయని, బీఆర్ఎస్ తన మార్గం తప్పిందని ఆమె విమర్శించారు. తన పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పనిచేస్తుందని, ఏ జాతీయ పార్టీతోనూ లేదా బీఆర్ఎస్‌తోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. మేము స్వతంత్ర ప్రాంతీయ శక్తిగా ఉంటాం. ప్రజల చేతిలో వాడియైన కత్తిలా మా పార్టీ పనిచేస్తుంది తప్ప, ఎవరి చేతుల్లోనూ ఉండదు అని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసంపూర్ణ అజెండాను పూర్తి చేయడమే లక్ష్యంగా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి అద్భుతమైన పాలన అందిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
