Let's talk: editor@tmv.in
కరీంనగర్ శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ వినతి

కరీంనగర్ శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ వినతి

Gaddamidi Naveen
9 మే, 2026

కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయని పేర్కొంటూ, ఈ అంశంపై పార్టీ ప్రజాప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.

ఈ బృందంలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. కరీంనగర్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ దుకాణాల దొంగతనాలు, ప్రజలపై దాడులు, గుంపులుగా సంచరిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్న సంఘటనలు నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సాధారణ ఘటన కాదని, రాజకీయ కక్షతో పన్నిన కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక బీజేపీకి చెందిన వ్యక్తుల ప్రేరణ ఉందని సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు, వాహనాల ధ్వంసం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని భయానక పరిస్థితులు సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల కరీంనగర్ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై, దాడులను ప్రేరేపించిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ, కరీంనగర్‌లో ప్రజలకు భద్రతాభావం కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.