

'అన్నలు' ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు జాగ్రత్త!: కవిత కీలక వ్యాఖ్యలు
సింగరేణి కాలరీస్ సంస్థలోని అధికారులు, యాజమాన్యం ప్రస్తుతం 'అన్నలు' (నక్సలైట్లు) లేరనే ధీమాతో కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు. అయితే, ఆ 'అన్నలు' అందరూ ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆమె హెచ్చరించారు. "బాయిబాట" కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే7 సింగరేణి గనిని సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారులు, కాంట్రాక్టర్ల అవసరాలను తీర్చడానికి సింగరేణి వద్ద నిధులు ఉంటున్నప్పుడు, కార్మికుల సంక్షేమానికి మాత్రం ఎందుకు నిధులు ఉండటం లేదని కవిత ప్రశ్నించారు.
గతంలో 'అన్నలు' చుట్టుపక్కల ఉండటం వల్ల అధికారులు కార్మికులతో కొంత హుందాతనంగా, సక్రమంగా ప్రవర్తించేవారని కవిత గుర్తుచేశారు. ఇప్పుడు అన్నలు లేరని అనుకుంటూ అధికారులు కార్మికుల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అడవిలో అన్నలు లేరని అనుకుంటున్నారమో.. ఆ అన్నలంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు జాగ్రత్త! అని టీఆర్ఎస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, వేధింపులకు గురిచేసే అధికారులపై కేసులు పెడతామని స్పష్టం చేశారు.
కార్మికులు ఎదుర్కొనే చిన్నపాటి కష్టాల పరిష్కారానికి కూడా నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడానికి మాత్రం భారీగా నిధులు సమకూరుస్తోందని మండిపడ్డారు. కార్మికులు పాత యంత్రాలనే మరమ్మతులు చేసుకుని వాడాల్సి వస్తోందని, వారికి సరైన భద్రతా పరికరాలు, కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మహిళా ఉద్యోగులు వస్తున్నారని, వారిని చూసి గర్విస్తున్నప్పటికీ.. గనుల వద్ద వారికి సరైన కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయమన్నారు. తాము గతంలో పార్లమెంట్‌లో పోరాడి సాధించిన మహిళా ఉద్యోగాల హక్కులను కాపాడుకుంటూ, వారి సౌకర్యాల కోసం పోరాడతామన్నారు.
సింగరేణి లాభాలను దాచేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని, గతంలో ఇచ్చిన దానికంటే రూ. 10 వేలు అదనంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలలో రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, 2 వేల మందికి పైగా వేచి చూస్తున్న డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మరిన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్స్ తెరిచి లక్ష మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.
ప్రభుత్వాల తీరుపై మండిపాటు
జూన్ 15తో పాటు మంగళవారం కూడా తాను గనుల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గనుల వద్ద సమావేశాల్లో పాల్గొనలేదా? అని నిలదీశారు. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేలా చేయకుండా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సింగరేణికి మరిన్ని మైనింగ్ బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గును మన సింగరేణికే ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి 51:49 నిష్పత్తిలో ఈక్విటీ భాగస్వామ్యం ఉందనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
