Let's talk: editor@tmv.in
తెలంగాణలో నేటి నుంచి విద్యార్థులకు బ్రేక్‌పాస్ట్ పథకం

తెలంగాణలో నేటి నుంచి విద్యార్థులకు బ్రేక్‌పాస్ట్ పథకం

Gaddamidi Naveen
15 జూన్, 2026

వేసవి సెలవుల అనంతరం నేటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం (2026-27) తొలిరోజైన జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మక ‘బ్రేక్‌ఫాస్ట్’ పథకంతో పాటు, విస్తరించిన ‘మధ్యాహ్న భోజన’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ల నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదివే విద్యార్థులకు ఈ పథకాలు వర్తిస్తాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

జూన్ 15 నుంచి మొదటి దశ ప్రారంభం

తొలి దశలో రాష్ట్రంలోని 1,302 విద్యాసంస్థల్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రారంభంలో మొత్తం 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆరు రోజులు (సోమవారం నుంచి శనివారం వరకు) పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. కేంద్రీకృత వంటశాలల ద్వారా భవిష్యత్తులో ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు విస్తరిస్తారు.

33 జిల్లాల్లో రూ. 299.90 కోట్ల అంచనా వ్యయంతో 39 కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 7 పాత వంటశాలలను ఆధునీకరిస్తుండగా, మిగిలిన వాటిని కొత్తగా నిర్మిస్తున్నారు. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం 70 శాతం భరిస్తుండగా, భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలు 30 శాతం సమకూరుస్తాయి. తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ దీనిని పర్యవేక్షిస్తుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ. 720 కోట్ల భారీ ఆర్థిక భారాన్ని భరించనుంది. ఇందులో రూ. 540 కోట్లు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి, రూ. 180 కోట్లు పాలు, అదనపు పోషకాల కోసం కేటాయించారు. ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరో రూ. 56 కోట్లు కేటాయించారు.

విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి పిల్లలకు 75 మిల్లీలీటర్ల పాలు, 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 100 మిల్లీలీటర్ల పాలు ఇస్తారు. ఈ పథకాన్ని తొలి దశలో 'హరేకృష్ణ మూమెంట్‌ చారిటబుల్ ట్రస్ట్' (వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాలు), అలాగే 'మన్నా ట్రస్ట్' (హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు) ద్వారా అమలు చేస్తున్నారు.

ఇంటర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం

రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు విస్తరిస్తున్నారు. జూన్ 15 నుంచి 33 కళాశాలల్లో ఇది ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ పథకం విస్తరించడం ద్వారా సుమారు 1.70 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

వారపు బ్రేక్‌ఫాస్ట్ మెనూ వివరాలు

సోమవారం: దోశ (2) - చట్నీ/సాంబార్

మంగళవారం: మిల్లెట్ (చిరుధాన్యాల) ఇడ్లీ (2) - సాంబార్

బుధవారం: పూరీ (2) - మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కుర్మా

గురువారం: బోండా (2) - చట్నీ/సాంబార్

శుక్రవారం: ఇడ్లీ (2) - చట్నీ/సాంబార్

శనివారం: ఉప్మా - చట్నీ/సాంబార్

(ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 150 గ్రాములు, 6 నుంచి 12వ తరగతి వరకు 200 గ్రాములు) ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాల ద్వారా విద్యార్థులలో పాఠశాలల హాజరు శాతం పెరగడంతో పాటు, వారి ఆరోగ్యం, విద్యా సామర్థ్యాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.