




అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు అత్యంత ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతోంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలు ఆదిలోనే హంసపాదులా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ రాయబారుల పర్యటనను ఆకస్మికంగా రద్దు చేయడంతో పాటు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పెట్టిన కఠిన నిబంధనలు ఈ సంక్షోభాన్ని మరింత జఠిలం చేశాయి.
ట్రంప్ దూకుడు.. రాయబారుల పర్యటన రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరగాల్సిన శాంతి చర్చల విషయంలో వెనక్కి తగ్గారు. పాకిస్థాన్‌లో చర్చలు జరపడానికి వెళ్లాల్సిన తన దూతలు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌ల పర్యటనను ఆయన రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు విమాన ప్రయాణం చేసి అంత దూరం వెళ్లడం సమయం, డబ్బు వృథా అని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడ కూర్చుని కాలక్షేపం ముచ్చట్లు చెప్పుకోవడానికి తమ ప్రతినిధులు సిద్ధంగా లేరని, ఈ విషయంలో అమెరికాదే పైచేయి అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ నాయకత్వంలో ప్రస్తుతం తీవ్రమైన గందరగోళం నెలకొందని, అక్కడ ఎవరి మాట చెల్లుతుందో వారికే తెలియని పరిస్థితి ఉందని ట్రంప్ ఎద్దేవా చేశారు. అటువంటి వారితో ముఖాముఖి చర్చలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇరాన్‌కు చర్చలు జరపాలని ఉంటే నేరుగా తమకు ఫోన్ చేయవచ్చని, ఫోన్ ద్వారానే మాట్లాడదామని ట్రంప్ కరాఖండిగా చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకు చర్చల కోసం ప్రత్యేకంగా దూతలను పంపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇరాన్ పట్టుదల.. నౌకా దిగ్బంధంపై ఆగ్రహం
అమెరికా తీరుపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఘాటుగా స్పందించారు. ఒకవైపు తమ నౌకాశ్రయాలను దిగ్బంధిస్తూ, మరోవైపు చర్చల గురించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. అమెరికా విధిస్తున్న నౌకా దిగ్బంధం ఎత్తివేస్తేనే కొత్త చర్చలకు తాము సిద్ధమని ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌నకు స్పష్టం చేశారు. అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. వాషింగ్టన్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల శాంతి ప్రక్రియపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
బాహ్య శక్తుల జోక్యం లేకుండా ప్రాంతీయ దేశాలన్నీ కలిసి శాంతి కోసం పనిచేయాలని ఇరాన్ కోరుతోంది. అయితే జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
సంధికి అడ్డంకిగా మారిన పీటముడులు
అమెరికా-ఇరాన్ మధ్య ప్రధానంగా ఐదు అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిని ఇరాన్ తిరస్కరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల జరిగిన నష్టానికి గానూ సుమారు 270 బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అలాగే విదేశాల్లో స్తంభించిపోయిన తమ 20 బిలియన్ డాలర్ల ఆస్తులను వెంటనే విడుదల చేయాలని కోరుతోంది.
మరోవైపు ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధిలో షిప్పింగ్ ఆంక్షలను ఇరాన్ కొనసాగిస్తోంది. అమెరికా తన నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు ఈ పట్టు సడలించబోమని ఇరాన్ అంటోంది. అటు ఒప్పందం కుదిరే వరకు ఆంక్షలు తీసేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
ఆర్థిక ఆంక్షలు.. విమానయాన రంగంపై ప్రభావం
ఇరాన్ ఆదాయ మార్గాలను దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇరాన్ నుండి చమురు కొని శుద్ధి చేస్తున్న చైనాకు చెందిన ఓ కంపెనీతో పాటు, ఆ చమురును రవాణా చేస్తున్న 40 ఓడల కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించారు. దీనివల్ల ఇరాన్ చమురు వ్యాపారం కష్టతరం కానుంది.
మరోవైపు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల విమాన ఇంధనం (జెట్ ఫ్యూయల్) కొరత ఏర్పడి, ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా విమానయాన సంస్థలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నాయి, ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి విమానాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఇస్తాంబుల్, మస్కట్, మదీనా వంటి నగరాలకు వాణిజ్య విమానాలు నడుస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. చర్చలు ఒకపక్క నిలిచిపోయినా, సామాన్య ప్రజల కోసం విమాన సర్వీసులను ప్రారంభించడం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల చమురు మార్కెట్‌తో పాటు రవాణా రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
యుద్ధ క్షేత్రంలో ఆగని మారణహోమం
మధ్యప్రాచ్యంలో యుద్ధ సెగలు ఇంకా చల్లారడం లేదు. ఇజ్రాయెల్ - హెజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ, సరిహద్దుల్లో కాల్పులు మాత్రం ఆగడం లేదు. శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు హెజ్బొల్లా సభ్యులు చనిపోగా, దానికి బదులుగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఇరాన్‌లో 3,375 మంది, లెబనాన్‌లో 2,496 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర పోరాటంలో సాధారణ ప్రజలతో పాటు అమెరికా సైనికులు, ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి దళ సభ్యులు కూడా బలికావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పాకిస్థాన్ ప్రయత్నాలు.. ఇరాన్ దూత పర్యటన
అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలన్న పాకిస్థాన్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జరిగిన 21 గంటల మారథాన్ చర్చలు విఫలమవగా, ఇప్పుడు రెండో విడత చర్చలు కూడా జరగకముందే ఆగిపోయాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఇప్పటికే పాకిస్థాన్ అధికారులకు తమ డిమాండ్ల జాబితాను అందజేశారు. కాగా ఇరు దేశాల చర్చల నేపథ్యంలో గత వారం రోజులుగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో విధించిన కఠిన భద్రతను సడలించారు.
సందిగ్ధంలో శాంతి చర్చల భవిష్యత్తు
అమెరికా తన ప్రతినిధుల పర్యటనను రద్దు చేసిన పది నిమిషాల్లోనే ఇరాన్ నుండి ఒక మెరుగైన ప్రతిపాదన అందినట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనలో ఏముందనే విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. "ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదు" అనేదే తన ప్రధాన నిబంధన అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబట్టడం, మరోవైపు "వారే మాకు ఫోన్ చేయాలి" అని ట్రంప్ ఖరాఖండిగా చెప్పడంతో మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన ఇప్పట్లో సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని అడ్డంకుల మధ్య ఈ సంధి ప్రయత్నాలు ఏ తీరానికి చేరుతాయో వేచి చూడాలి.
