Let's talk: editor@tmv.in
‘అగధ’లో మహాదేవిగా పొలిమేర నటి సాయికామాక్షి భాస్కర్ల

‘అగధ’లో మహాదేవిగా పొలిమేర నటి సాయికామాక్షి భాస్కర్ల

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

‘మా ఊరి పొలిమేర’ వంటి సెన్సేషనల్ చిత్రంతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల (భాస్కర్ల సాయి) ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎం.ఎస్. రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’ నుంచి ఆమె లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన ‘మహాదేవి’ పాత్రను ఆమె పోషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

చీకటిని శాసించే శక్తిగా

చీకటి రాజ్యమేలుతున్న ప్రపంచంలో క్రమాన్ని నెలకొల్పే మహాశక్తిగా ఆమె వస్తోంది అంటూ మహాదేవి పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. నిషిద్ధ సత్యాల అన్వేషణ, దైవ మరియు చీకటి శక్తుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథలో సాయి కామాక్షి పాత్ర కథను మలుపు తిప్పే కీలక అంశంగా నిలవనుంది.

సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు మార్కు సినిమా ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎం.ఎస్. రాజు ‘సంక్రాంతి రాజు గా సుపరిచితులు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా శత్రువు, దేవి, ఒక్కడు, వర్షం, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను అందించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. విజువల్ గ్రాండియర్, అద్భుతమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆయన, ‘అగధ’ను తన కెరీర్‌లోనే ఒక భారీ ప్రయోగంగా తీర్చిదిద్దుతున్నారు.

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సుమారు 85 రోజుల పాటు విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంది. దాదాపు 45 నిమిషాల నిడివి గల హై-క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కిన్ అరుల్ దేవ్ సంగీతం అందిస్తుండగా నాని మామిడిశెట్టి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళ, హిందీతో సహా ఐదు భాషల్లో విడుదల కానుంది.

‘అగధ’లో మహాదేవిగా పొలిమేర నటి సాయికామాక్షి భాస్కర్ల - Tholi Paluku