
పార్టీ విజయానికి బూత్ లెవల్ ఏజెంట్లే వెన్నముక్క: వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు
ఎన్నికల్లో పార్టీ గెలుపును నిర్ణయించే అసలైన శక్తి బూత్ లెవల్ ఏజెంట్లేనని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏజెంట్లు ఎంత బలంగా పనిచేస్తే పార్టీ అంతటి ఘన విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40, 50, 55 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు, సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీకి, ఓటర్లకు మధ్య వారధిగా ఉండే ఏజెంట్లు ప్రతి బూత్‌లో రక్షణ కవచంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఏజెంట్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా 2002 తర్వాత పుట్టి కొత్తగా ఓటు హక్కు పొందే యువత ఓటర్ల నమోదు విషయంలో చురుకుగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
కాగా పార్టీ గెలుపు ఓటములు ఏజెంట్ల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయని అందుకే ప్రతి బూత్‌లో కమిటీలను ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డి, 50వ డివిజన్ వైసిపి అధ్యక్షులు బంక విజయ, పశ్చిమ బూత్ కమిటీల అధ్యక్షులు వడ్డురి యశోధర్, రావు తదితరులు పాల్గొన్నారు.
