Let's talk: editor@tmv.in
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా

బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా

Dantu Vijaya Lakshmi Prasanna
6 జులై, 2026

ఆషాఢ బోనాల మహోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన–అమ్మకాల మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం పక్కన) ఈ ప్రత్యేక మేళా ప్రారంభం కానుంది. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మేళాలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయ చేతివృత్తి కళాకారులకు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం కల్పించనున్నారు.

బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల సంప్రదాయ వస్తువులు ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ మేళాను రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, శతాబ్దాల చరిత్ర కలిగిన చేతివృత్తుల వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువ మంది కళాకారులకు అవకాశం కల్పిస్తూ అధిక సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేళాలో రాష్ట్రంలోని కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నేత కళాకారులు, బంగారు పనివారు, రాతి శిల్పులు, బుట్టల తయారీదారులు, తోలు కళాకారులు తదితర సంప్రదాయ వృత్తుల వారు పాల్గొననున్నారు. వారు తయారు చేసిన నాణ్యమైన చేతి ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం ఈ మేళా ద్వారా లభించనుంది. దీని వల్ల కళాకారులకు మెరుగైన ఆదాయం సమకూరడమే కాకుండా వారి సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం లభించనుంది.

బోనాల సందర్భంగా భక్తులకు అవసరమయ్యే మట్టి బోనం కుండలు, మట్టి దీపాలు, వెదురు బుట్టలు, గంపలు, జల్లెడలు, ఇత్తడి, రాగి చెంబులు, కలశాలు, ఘటాలు, గంటలు, పూజా సామగ్రి, పూల దండలు, తోరణాలు, బోనం అలంకరణ వస్త్రాలు, గాజులు, పూసల అలంకరణ సామగ్రి వంటి అనేక వస్తువులు ఈ మేళాలో అందుబాటులో ఉంటాయి. అలాగే పోతురాజు ఉపయోగించే కొరడాలు, కాళ్ల గజ్జెలు, డప్పులు, డోలు వంటి సంప్రదాయ వాద్యాలు, చెక్కతో తయారుచేసిన పూజా పీటలు, మండపాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, బోనాల మహోత్సవాలు వేలాది మంది చేతివృత్తి కళాకారులకు ఉపాధి కల్పించే ప్రధాన పండుగలలో ఒకటి. ఈ మేళా ద్వారా వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభించడంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, సంప్రదాయ కళలను భావితరాలకు చేరవేయడంలో కూడా ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషించనుంది.

ప్రజా ప్రభుత్వం చేతివృత్తుల పరిరక్షణకు, సంప్రదాయ కళాకారుల జీవనోపాధి బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంది. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తూ కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

బోనాల సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చే లక్షలాది మంది భక్తులు ఈ రాష్ట్రస్థాయి వస్తు ప్రదర్శనను సందర్శించి చేతివృత్తుల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. "మనము కొనుగోలు చేసే ప్రతి చేతి ఉత్పత్తి ఒక కళాకారుడి కుటుంబానికి భరోసా, ఒక సంప్రదాయ వృత్తికి జీవం" అనే సందేశంతో ఈ మేళాను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ సంప్రదాయ చేతివృత్తులకు కొత్త ఊపునిచ్చే ఈ ప్రత్యేక మేళాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులకు అండగా నిలవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ట్యాగ్‌లు
Bonalu2026HyderabadBonaluFestivalTelanganaHandicraftsHandloomHMDAGroundsTelanganaCultureTraditionalCraftsBonaluShoppingSERPRuralDevelopmentLocalArtisansVocalForLocalMadeInTelanganaPoojaItemsBonamHyderabadEventsFestivalShoppingTelanganaNews
బోనాల సందడి మొదలు.. జూలై 16 నుంచి రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల మహా మేళా - Tholi Paluku