Let's talk: editor@tmv.in
ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్ కేంద్రంలో బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సక్తి జిల్లాలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బాయిలర్ పేలుడు సంభవించి తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, సింగితరాయ్ గ్రామంలో ఉన్న వేదాంత లిమిటెడ్‌ విద్యుత్ కేంద్రంలోని బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ఘటన స్థలంలోనే మరణించగా, మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సక్తి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని రాయగఢ్ జిల్లాలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొనసాగుతున్న రక్షణ చర్యలు

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలన అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. బాయిలర్ ప్రాంతం ఇంకా తీవ్రంగా వేడిగా ఉండటంతో అక్కడి నుంచి కార్మికులను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుని ఉన్నారా అనే అంశంపై రక్షణ సిబ్బంది పరిశీలిస్తున్నారని వారు చెప్పారు.

సీఎం స్పందన

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంపై స్పందించిన విద్యుత్ కేంద్ర యాజమాన్యం ప్రకారం, సింగితరాయ్ ప్లాంట్‌లోని ఒక బాయిలర్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఆ యూనిట్ నిర్వహణ బాధ్యతలు ఉపకాంట్రాక్టర్ సంస్థ అయిన ఎన్‌టీపీసీ జీఈ పవర్‌‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఎన్‌జీఎస్‌ఎల్) వద్ద ఉన్నాయని పేర్కొంది. గాయపడిన వారికి ఉత్తమ వైద్యసేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అని యాజమాన్యం తెలిపింది. స్థానిక అధికారులు, వైద్య బృందాలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది.