Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం చారిత్రక అవకాశాన్ని నిరాకరించడమే: ఏపీ సీఎం

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం చారిత్రక అవకాశాన్ని నిరాకరించడమే: ఏపీ సీఎం

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకాల్సిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) లోక్‌సభలో ప్రతిబంధకాన్ని ఎదుర్కొంది. పార్లమెంటు దిగువ సభలో రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో తిరస్కరణకు గురైంది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (352 ఓట్లు) దక్కకపోవడంతో ఈ కీలక బిల్లు ఆమోదం పొందలేదు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.

మహిళలకు జరిగిన వంచన: ముఖ్యమంత్రి చంద్రబాబు

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని "దేశం కోల్పోయిన ఒక చారిత్రక అవకాశం"గా ఆయన అభివర్ణించారు. మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు మహిళలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది మహిళలకు ఇది పెద్ద వంచన అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కూడా చంద్రబాబు స్పందిస్తూ జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య వ్యవస్థను కాపాడుతూనే సంస్కరణలు ఉండాలన్నదే ఎన్డీయే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

గొప్ప అవకాశం చేజారింది: పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహిళా లోకానికి రాజకీయంగా పెద్దపీట వేసే "గొప్ప అవకాశం" చేజారిందని ఆయన అన్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే దేశవ్యాప్తంగా మహిళా శక్తికి కొత్త ఉత్సాహం వచ్చేదని దీన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

దక్షిణాదికి అన్యాయం: వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పరిణామాన్ని వేరొక కోణంలో విశ్లేషించారు. బిల్లు వీగిపోవడం వల్ల మహిళలతో పాటు ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీనిపై స్పష్టత లేకపోవడమే అడ్డంకిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ వ్యూహం విఫలమైంది: వైఎస్ షర్మిల

మరోవైపు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల ఈ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్ ప్రక్రియను ముడిపెట్టడం వెనుక ఉన్న అన్యాయమైన రాజకీయం ఇప్పుడు బహిర్గతమైందని ఆమె విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించలేదని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: పీవీఎన్ మాధవ్

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మహిళల ప్రయోజనాలను కాంగ్రెస్ కాలరాస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని చాటుకుందని భవిష్యత్తులో ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ బిల్లు తిరస్కరణతో దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం వంటి అంశాలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం చారిత్రక అవకాశాన్ని నిరాకరించడమే: ఏపీ సీఎం - Tholi Paluku